Pawan Klayan: పవన్ స్టైల్ మార్చారా ?

Pawan Klayan: ఇంతకాలానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ డైరెక్టుగా జనాలకు ఒక అప్పీల్ చేశారు. అదేమిటంటే ఒక్కసారి జనసేనను నమ్మి అధికారం అప్పగించమన్నారు. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యతను తీసుకుంటామన్నారు. ఇప్పటికి చాలామందికి అధికారం అప్పగించారు కాబట్టి జనసేనకు కూడా అధికారం ఇవ్వమని అడిగారు. మామూలుగా అయితే ఇంతకాలం పవన్ జనాలను ఇలా డైరెక్టుగా అడిగింది దాదాపు లేదనే చెప్పాలి.

ఎక్కడ మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని కానిచ్చేదిలేదని, వైసీపీని గెలవనిచ్చేదిలేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలినిచ్చేదిలేదని, జగన్ ముఖ్యమంత్రి ఎలాగవుతారో చూస్తానని..ఇలాగే మాట్లాడేవారు. నిజానికి వైసీపీకి జనాలు ఓట్లేయకుండా పవన్ అడ్డుకోలేరు. జగన్ సీఎం కానీకుండా అడ్డుకునేంత శక్తి పవన్ కు లేదు. అందుకనే తనకు ఓట్లేయమని అడగటమే ఉత్తమమని చాలామంది పవన్ కు సలహాఇచ్చినా పట్టించుకోలేదు. అలాంటిది మొదటిసారి పర్చూరులో జరిగిన బహిరంగసభలో డైరెక్టుగా జనసేనకు ఓట్లేసి గెలిపించమని అడిగారు.

నిజానికి ఇపుడు అడిగినట్లే జనాలను జనసేనను గెలిపించమని ఎప్పుడో అడిగుండాలి. కానీ ఏవేవో కారణాల వల్ల జనాలను డైరెక్టుగా అడిగింది చాలా తక్కువనే చెప్పాలి. తనను గెలిపించమని, పార్టీకి ఓట్లేసి అధికారం అప్పగించమని పవన్ అడగకపోతే జనాలు మాత్రం ఎందుకు ఓట్లేస్తారు ? కాబట్టి పవన్ ఇకనుండి ఇదే స్టైల్లో ఓటర్ల దగ్గరకు వెళ్ళిపోవాలి. బాబూ ఓట్లేయండి, అమ్మా ఓట్లేయండని అడిగితేనే జనాలు ఓట్లేసేది అనుమానం.
అలాంటిది ముఖ్యమంత్రి అయిపోదామని తాను పార్టీ పెట్టలేదని, పదవులపై ఆశతో తాను పార్టీ పెట్టలేదని చెబితే ఓట్లెవరు వేస్తారు ? రాజకీయాల్లోకి వచ్చే ప్రతిఒక్కరు పదవుల కోసం, అధికారం కోసమే వస్తారన్న విషయం చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. పదవుల కోసం రాలేదని చెబితే నమ్మేజనాలు కూడా ఎవరు లేరు. ఒకవైపు చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించమని, అధికారం అప్పగించమని పదే పదే జనాలను అడుగుతున్నారు.

ఇదే సమయంలో తనకు రెండోసారి అధికారం అప్పగించమని జగన్ కూడా డైరెక్టుగానే జనాలను అడుతున్నారు. ఎంతకష్టాలు వచ్చినా రు. 1.35 లక్షల కోట్లతో సంక్షేమపథకాలు అమలుకు ఖర్చుచేసినట్లు బహిరంగసభల్లో చెబుతున్నారు. ప్రత్యర్ధులు ఇద్దరు అధికారం విషయంలో, గెలుపు విషయంలో ఇంత స్పష్టంగా ఉన్నపుడు జగన్ కూడా అంతే స్పష్టంగా ఉండాలి. తాను చెప్పదలచుకున్నదేమిటో జనాలకు డైరెక్టుగా అర్దమయ్యేట్లు, బుర్రలోకి ఎక్కేట్లుగా చెప్పాలి.

రాబోయే విజయదశమి నుండి బస్సుయాత్ర మొదలుపెట్టబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. కాబట్టి యాత్రలో తనకు అధికారం అప్పగించమని, ఓట్లేసి జనాలను గెలిపించాలని జనాలను విజ్ఞప్తి చేయాల్సిందే. ఇందులో తప్పుకూడా ఏమీలేదు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి జనాలతో డైరెక్టుగానే పవన్ కాంటాక్టు పెట్టుకోవాల్సిందే అధికారం అప్పగించమని అడగాల్సిందే. ఇందులో మొహమాటానికి తావే అవసరంలేదు.