YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా ఉమా లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారా…? ఇప్పటికే వ్యూహాల అమలు కూడా మొదలైందా…? జగన్ పై రాళ్ళ దాడి జరిగితే వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ ఎందుకు…? ఇప్పుడు ఈ ప్రశ్నలు బెజవాడతో పాటుగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇటీవల సిఎం జగన్ విజయవాడ బస్ యాత్రకు వెళ్ళగా అక్కడ చోటు చేసుకున్న పరిణామం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆ ఘటనతో కోడి కత్తి డ్రామా రెండో భాగానికి తెరలేచింది అనే ఆరోపణలు వినిపించాయి.
ముఖ్యంగా ఇక్కడ బొండా ఉమాను లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు పన్నినట్టుగా స్పష్టంగా అర్ధమవుతోంది. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎలాగైనా గెలవాలనే లక్ష్యంగా చేసుకుని సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యూహాలు సిద్దం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. వెల్లంపల్లి నివాసంలో తాజాగా చర్చలు కూడా జరిగినట్టుగా సమాచారం. రాళ్ళ దాడి జరిగిన తర్వాత మూడు రోజులకు ఎవరో కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. వాళ్ళను విచారణ పేరుతో వేధిస్తూ బొండా ఉమా పేరు చెప్పమని ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
తద్వారా ఆయనపై హత్యాయత్నం తరహా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించి పోటీ నుంచి తప్పుకునే విధంగా చేయాలని పథకం సిద్దం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఆ యువకులకు నాయకత్వం వహించింది బొండా ఉమా మనిషి అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. బొండా ఉమా విజయం దాదాపుగా ఖరారు అయిన నేపధ్యంలో ఆయన నామినేషన్ వేయక ముందే పోటీ నుంచి పక్కకు తప్పుకునే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాళ్ళ దాడి చేసిన యువకుడు డబ్బులు ఇవ్వలేదని చేసినట్టుగా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. కాని ఆ యువకుడ్ని ఈ విధంగా ఒత్తిడి చేస్తున్నారని సమాచారం.
వెల్లంపల్లి తనకు కూడా రాయి తగిలినట్టుగా డ్రామా మొదలుపెట్టి ఆస్పత్రిలో కట్లు వేయించుకున్నారు. ఆ తర్వాత ఆయనను పరామర్శించేందుకు వెల్లంపల్లి నివాసానికి వెళ్ళారు. అక్కడ విజయవాడ సీపీ కాంతి రాణా టాటా అలాగే కొందరు పోలీసులు కూడా సమావేశమై వ్యూహంపై చర్చించారు అని తెలుస్తుంది. నామినేషన్ వేయకముందే వెల్లంపల్లి ని కేసు నుంచి పక్కకు తప్పించాలని, అలాగే చంద్రబాబు, నారా లోకేష్ తో పాటుగా మరికొందరు టీడీపీ నేతలను కూడా ఈ కేసులో ఇరికించాలి అని ప్రణాళిక సిద్దం చేసుకున్నట్టుగా తెలుస్తుంది.
బొండా ఉమా మీద కేసులు పెట్టించేందుకు లేదా ఆయనను ఓడించేందుకు గ్రౌండ్ లెవెల్ లో ప్రణాళిక సిద్దం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వెల్లంపల్లి ని గెలిపించెందుకే ఎంత వరకైనా వెళ్ళడానికి సజ్జల సిద్దం కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ప్రజల్లో మాత్రం రాళ్ళ దాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ తన పదవీ కాంక్షతో చేయించుకున్న దాడి అనేది ప్రజలకు స్పష్టంగా అర్ధమవుతుంది. ఎన్నికల సమయంలోనే ఈ చర్యలు జరగడం అనేక అనుమానాలకు తావిస్తుంది అని, ఇలాంటి పప్పులు అప్పుడు ఉడికాయి గాని ఇప్పుడు అంత సినిమా లేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.