Nara Lokesh – Vangaveeti Radha : టీడీపీలో ఉన్నప్పటికీ ఆ పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ.. త్వరలో జనసేన తీర్ధం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 14న మచిలీపట్నంలో జరిగే జనసేన ఆవిర్బావ సభలో రాధా ఆ పార్టీలో చేరతారనే మాట గట్టిగానే వినిపిస్తోంది. వీటికి రాధ నేరుగా చెక్ పెట్టారు. టీడీపీ యువనేత నారా లోకేష్ పీలేరు నియోజకవర్గంలో చేస్తున్న యువగళం పాదయాత్రలో వంగవీటి రాధా దర్శనమిచ్చారు.
అంతేకాకుండా రాధ లోకేష్ తో కలిసి కాసేపు పాదయాత్రలో నడిచారు. పాదయాత్ర విరామం సమయంలో లోకేష్ తో కలిసి భేటీ అయ్యారు. దీనిని బట్టి చూస్తే రాధ ఇక నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. లోకేష్ పాదయాత్రలో హఠాత్తుగా వంగవీటి రాధా వచ్చి కలవడంతో టీడీపీ శ్రేణులుల్లో జోష్ కనిపిస్తుంది.
లోకేష్ ను పాదయాత్రలో కలిసేందుకు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లిన వంగవీటి రాధా.. లోకేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత పాదయాత్రలో తనతో పాటు వచ్చిన అనుచరులతో కలిసి పాల్గొన్నారు. నడుస్తూనే మధ్యలో తన అనుచరుల్ని లోకేష్ కు పరిచయం చేశారు. వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధాను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలనే విషయంలో టీడీపీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు చేస్తోంది.