Janasena: తిరుగుబాటు ఎంపీ జనసేనలో చేరటం ఖాయమేనా ?

Janasena: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు చూపు జనసేన వైపు మళ్ళిందా ? ఇదివరకు నుండే ఆయన చూపు జనసేన వైపు మళ్ళిందని సమాచారం. గతంలో నరసాపురం ఎంపీగా రాజీనామా చేసే విషయమై బాగా ఊగారు. వైసీపీ ఎంపీగా రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ జరగబోయే ఉపఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీచేస్తారు ? ఏ పార్టీ తరపున పోటీచేయాలనే ప్రశ్న తలెత్తింది. అప్పుడే రాజుగారి చూపు జనసేనపైన పడిందంటున్నారు.

నరసాపురం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ మొదటినుండి కాంగ్రెస్ చాలా బలంగా ఉండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత సీన్ మారిపోయి ఆ పార్టీకి దిక్కులేకుండా పోయింది. కాంగ్రెస్ చాలా బలంగానే ఉన్నా అప్పుడప్పుడు టీడీపీ కూడా గెలుస్తుండేది. ఇదే సమయంలో చాలా రేర్ గా బీజేపీ అభ్యర్ధులు కూడా గెలిచారు. చరిత్రను వదిలేసి వర్తమానాన్ని మాత్రమే తీసుకుంటే ఇక్కడ వైసీపీ చాలా బలంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడినుండి రఘురాజు కాకుండా ఇంకెవరైనా అయ్యుంటే మెజారిటి ఇంచా ఎక్కువగా వచ్చేదని పార్టీ వాళ్ళే చెబుతారు.

మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన పవన్ కల్యాణ్ సోదరుడు నాగుబాబుకు సుమారు 2.5 లక్షల ఓట్లొచ్చాయి. అంటే ఈ బెల్టులో రాజకీయధికారం ఎక్కువగా కాపులు, రాజుల మధ్యే మారుతోంది. ఓట్లపరంగా తీసుకుంటే బీసీలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. సో ఏ పార్టీ తరపున పోటీచేస్తే తనకు ఉపయోగమనే విషయంలో రఘురాజు సర్వే చేయించుకున్నారట. జనసేన అయితే బాగుంటుందని లాజికల్ గా కూడా ఎంపీకి అర్ధమైందట.

టీడీపీ తరపున పోటీచేస్తే మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన మద్దతిచ్చే అవకాశాలు లేవు. టీడీపీని బీజేపీ వ్యతిరేకిస్తున్న కారణంగా జనసేన మద్దతు కూడా డౌటే. అందుకనే తాను జనసేనలో చేరితే ఇటు బీజేపీ మద్దతుతో పాటు అటు టీడీపీ మద్దతు కూడా తీసుకోవచ్చన్నది రఘురాజు ప్లాన్. అయితే ఇక్కడ సమస్యేమిటంటే టీడీపీ గనుక పోటీలో దిగకపోతే భవిష్యత్తులో పార్టీకి చాలా ఇబ్బందులు ఎదురవటం ఖాయం. పోటీలోకి అంటు దిగితే కచ్చితంగా గెలుపుకోసం పోరాడాల్సిందే. అంతేకానీ జనసేన తరపున పోటీచేయాలని అనుకుంటున్న రాజుగారి గెలుపుకు టీడీపీ లోపాయికారీగా సహకరిస్తే ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది.

సో ఇవన్నీ ఆలోచించే తిరుగుబాటు ఎంపీ చూపు జనసేనపైన ఉందంటున్నారు. ఈయన కూడా ఈమధ్య మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పొత్తులు గరిష్టంగా మూడు పార్టీలు, కనిష్టంగా రెండుపార్టీల మధ్య ఉంటుందన్నారు. ఇదే సమయంలో తాను ఏదో పార్టీలో చేరటం మాత్రం ఖాయమని చెప్పారు. అందుకనే రాజుగారు చేరబోయేది జనసేనలోనే అన్న ప్రచారం ఊపందుకుంది. కాకపోతే రాజీనామా, ఉపఎన్నికలు, మళ్ళీ పోటీచేయటం అనే కాన్సెప్టును ఎంపి వదిలేసినట్లున్నారు. అంటే డైరెక్టుగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనే రంగంలోకి దిగుతారేమో చూడాలి.