Pawan Kalyan: పవన్ ఫుల్ టైం రంగంలోకి దూకాల్సిందేనా ?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫుల్ టైం రాజకీయాల్లోకి దిగాల్సిన సమయం వచ్చేసిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకవైపు అధికార వైసీపీ సామాజిక న్యాయభేరి పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి మంత్రులు, ఎంఎల్ఏలు, నేతల ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి కూడా జనాల్లోకి దూసుకుని వెళుతున్నారు.

ఇదే సమయంలో వైసీపీని ఎదుర్కునేందుకు తెలుగుదేశంపార్టీ కూడా ప్రణాళికలు అమలుచేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు కార్యక్రమంతో జిల్లాలు తిరిగారు. తాజాగా రెండురోజుల మహానాడు నిర్వహణ, బహిరంగసభతో చంద్రబాబు, తమ్ముళ్ళల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఏడాదంతా ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాల పేరుతో జనాల్లో ఉండేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారు. అంటే తాను యాక్టివ్ అవటమే కాకుండా పార్టీ నేతలను కూడా నియోజకవర్గాల్లో తిరిగేట్లుగా ప్లాన్ చేశారు.

అంటే గడప గడపకు వైసీపీ పేరుతో అధికారపార్టీ నేతలు, ఎన్టీయార్ శతజయంతి పేరుతో మినీమహానాడు నిర్వహణ కార్యక్రమాలతో ప్రతిపక్ష నేతలు జనాల్లోనే ఉంటున్నారు. మరి అధికార, ప్రధాన ప్రతిపక్షపార్టీ జనాల్లో ఉండేందుకు ఇంతగా ప్లాన్ చేస్తుంటే మరి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి చేస్తున్నారు ? షూటింగుల మధ్యలో గ్యాప్ వచ్చినపుడు కౌలురైతుల కోసమంటు కర్నూలు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించారు. జనాల్లో నమ్మకం కలిగించాలంటే ఈ పద్దతి ఎంతమాత్రం ఆమోదయోగ్యంకాదని పవన్ గ్రహించాలి.
నిత్యం తమతో ఉండే నేతలనే జనాలు ఆదరిస్తారని పవన్ తెలుసుకోవాలి. ప్రజా సమస్యలపై ఇపుడిప్పుడే జనసేన నేతలు, కార్యకర్తలు జనాల్లోకి చొచ్చుకుని వెళుతున్నారు. అవకాశాలున్నచోట్ల పార్టీ కార్యాలయాలను ఓపెన్ చేస్తున్నారు. జనాలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే పవన్ రంగంలోకి దిగిపోవాలి. తానుకూడా ప్రత్యేకంగా అజెండా, టైం టేబుల్ వేసుకుని జనాల్లో తిరగటం మొదలుపెట్టాలి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుంది కదాని అనుకుంటే కుదరదు.

ఎన్నికలకు ఇక ఉన్నది ఏడాదిమాత్రమే అన్నది గ్రహించాలి. ఎందుకంటే చివరి ఏడాది పూర్తిగా ఎన్నికల సంవత్సరమే అయిపోతుంది. ఒకవైపు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు చంద్రబాబు పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఇదే నిజమైతే అప్పుడు పవన్ చేతులెత్తేయటం మినహా చేయటానికి ఏమీవుండదు. కాబట్టి రెండు ప్రధాన పార్టీల వైఖరిని దృష్టిలో పెట్టుకునే పవన్ కూడా కార్యక్రమాలను ఏడాదిపాటు డిజైన్ చేసుకోవాలి.

ప్రత్యర్ధులకు ధీటుగా నిత్యం జనాల్లో ఉండేట్లుగా పవన్ కూడా కార్యాచరణను ప్లాన్ చేసుకోవాలి. మిత్రపక్షం బీజేపీకి జనాల్లో ఉన్న బలం ఏమీలేదని ముందు తెలుసుకోవాలి. బలంలేకపోగా విపరీతమైన నెగిటివిటి ఉంది. దాన్ని అధిగమించి ఓట్లు తెచ్చుకోవాలంటే పవన్ షూటింగుల గ్యాప్ లో రాజకీయాలు చేస్తానంటే కుదరదు. ఫుల్ టైం రాజకీయాల్లోకి దిగిపోవాల్సిన సమయం వచ్చేసిందని ఇప్పటికైనా పవన్ గ్రహించాలి.