pawan kalyan: పవన్ దెబ్బకు మొదలైన అయోమయం

pawan kalyan:  జనసేన అధినేత పవన్ కల్యాణ్ దెబ్బకు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా అయోమయం మొదలైపోయింది. రాజకీయాల్లో అయోమయం అంటే ముఖ్యంగా మిత్రపక్షం బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీలోనే. కాకపోతే దీని ప్రభావం అధికార వైసీపీ మీద కూడా ఏదోరూపంలో కొద్దోగొప్పో పడకతప్పదు. ఇంతకీ పవన్ వల్ల మొదలైన అయోమయం ఏమిటి ? ఏమిటంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి పవన్ మూడు ఆప్షన్లు ప్రకటించారు. దీంతో ఆప్షన్ల విషయంలో గందరగోళం మొదలైంది.

ఆ ఆప్షన్లు ప్రకటించటం వెనుక అసలు పవన్ ఉద్దేశ్యం ఏమిటో కూడా ఎవరికీ అర్ధం కావటంలేదు. ఇంతకీ పవన్ ఇచ్చిన ఆప్షన్లు ఏమిటంటే మొదటిది బీజేపీ+జనసేన కలిసి పోటీచేయటం. రెండోదేమిటంటే తెలుగుదేశంపార్టీని కూడా కలుపుకుని పోటీచేయటం. చివరది, మూడోదేమిటంటే జనసేన ఒంటరిగా పోటీచేయటం. పవన్ ఇచ్చిన మూడు ఆప్షన్లు చూసిన తర్వాత ఒంటరిగానే పోటీచేయటానికి పవన్ నిర్ణయించుకున్నారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఈ అనుమానానికి హేతువు ఏమిటంటే బీజేపీతో కలిసి పోటీచేయటం పవన్ క మొదటినుండి ఇష్టంలేదని తెలుస్తునే ఉంది. ఎందుకంటే బీజేపీకి ఉన్నదే 0.56 శాతం ఓటుబ్యాంకు. ఒక్కశాతం ఓటుబ్యాంకు కూడా లేని బీజేపీని మోయాలంటే పవన్ కు చాలా కష్టమే. పైగా బీజేపీ మీదున్న మైనసులన్నీ పవన్ కు కూడా అంటుకుంటాయనేది అందరికీ తెలిసిందే. కాబట్టి బీజేపీతో పొత్తువల్ల పవన్ కు సమస్య ఏమిటంటే కమలంపార్టీకి సీట్లను ఇవ్వాలి, అభ్యర్ధులనూ చూడాలి, తానే ప్రచారం చేసి ఓట్లనూ తానే తేవాలి. ఇదంతా పవన్ వల్ల జరిగేపనికాదు.

ఇదే సమయంలో ఇంతకాలం లవ్ ప్రపోజల్ పంపుతున్న చంద్రబాబునాయుడు వైఖరిలో మార్పు వచ్చేసింది. మునుపటిలా జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ఆసక్తి చూపుతున్నట్లు లేదు. బాదుడే బాదుడు కార్యక్రమానికి హాజరైన జనాలు, మహానాడు బహిరంగసభకు జనాలు పెద్దఎత్తున హాజరయ్యారని చంద్రబాబు+తమ్ముళ్ళ సంబరపడిపోతున్నారు. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత+చంద్రబాబును సీఎంగా చేయాలని జనాలంతా డిసైడ్ అయిపోయారని ఇటు చంద్రబాబు అటు తమ్ముళ్ళు+ఎల్లోమీడియా కొద్దిరోజులుగా ఊదరగొట్టేస్తున్నారు.

దాంతో ఎవరితోను పొత్తులేకపోయినా టీడీపీకి వచ్చే ఇబ్బంది ఏమీలేదని దాదాపు డిసైడ్ అయిపోయారు. ఇంకా జనసేనతో పొత్తుంటేనే టీడీపీకి నష్టమనే భావనను చంద్రబాబు ముందు కొందరు సీనియర్లు పదే పదే చెబుతున్నారు. అందుకనే ఇపుడు చంద్రబాబు కూడా పొత్తులపై ఏమీ మాట్లాడటంలేదు. అంటే అటు బీజేపీని మోయటం పవన్ ఎలా ఇష్టంలేదో ఇటు పవన్ తో పొత్తు పెట్టుకోవటం కూడా తమ్ముళ్ళల్లో కొందరికి ఏమాత్రం నచ్చటంలేదు.

ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించకపోతే టీడీపీతో పొత్తు అవసరంలేదని పవన్ కే ఉంది. ఇదే విషయాన్ని జనసేన సీనియర్ నేతలు కూడా పదే పదే పవన్ కు చెప్పారు. అందుకనే తాను ఎవరిపల్లకీ మోసేందుకు సిద్ధంగా లేనని తాజాగా కూడా ప్రకటించింది. ఇదంతా చూస్తుంటే చివరకు పవన్ ఒంటరిగా పోటీచేయటానికి మానసికంగా రెడీ అవుతున్నట్లే అనిపిస్తోంది.