వైసీపీ మంత్రికి చుక్కెదురు….దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన మహిళ!

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రోజు రోజుకు పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరేందుకు అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో నిత్యం ఆయా పార్టీల నేతల మధ్య సాగే మాటల యుద్ధంతో పాటు రాజకీయాల్ని దగ్గరి నుంచి గమనిస్తున్న సాధారణ జనం తీవ్ర గందరగోళానికి గురవుతున్న పరిస్థితి. కొంత మంది జనం ఈ గందరగోళంలో బ్రతుకుతుంటే మరికొందరు మాత్రం ఏ పార్టీ కి ఓటు వెయ్యాలో డిసైడ్ ఐపోయారు.

ఇదే క్రమంలో జగనన్న సురక్ష కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నగర్ పాలక సంస్థ పరిధిలో గల గూనపాలెంలో మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారికి ఒక చేదు అనుభవమే ఎదురయింది. ఈ కార్యక్రమానికి హాజరై తన వద్ద నుంచి ధృవపత్రం తీసుకుంటున్న ఓ లబ్దిదారు మహిళను ధర్మాన ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు ఆమె ఏమాత్రం తడుము కోకుండా ఓ షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఆమె ఇచ్చిన సమాధానానికి ధర్మాన ఒక్క క్షణం అవాక్కయ్యారు. అంతలోనే తేరుకుని పక్కనున్న వైసీపీ నేతలు, అధికారులకు ఆమె ఏం చెప్పిందో వివరించారు.

ఇంతకీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆ మహిళను అడిగిన ప్రశ్నేంటో తెలుసా? ఏ గుర్తుకు ఓటేస్తావు అని. ఈ ప్రశ్నకు ఆ మహిళ ఏమాత్రం తడుముకోకుండా సైకిల్ అని సమాధానం చెప్పేసింది. దీంతో తాను ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యానేమో అనుకుని ధర్మాన మరోసారి ఏ గుర్తు అని ప్రశ్నించారు. దీంతో రెండోసారి కూడా ఆమె సైకిల్ అనే సమాధానం చెప్పింది. దీంతో పక్కనే ఉన్న వైసీపీ నేతలు, అధికారుల్ని పిలిచి ఇదిగో చూడండి ఈమె సైకిల్ గుర్తుకే ఓటేస్తుందట అంటూ ధర్మాన చెప్పారు. అక్కడితో ఆగకుండా సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఏమవుతుందో కూడా చెప్పేశారు.

ఈ నేపథ్యంలో సైకిల్ గుర్తుకు ఓటు వేయడం తప్పు కాదని, కానీ తెలిసి తెలిసి గోతిలో పడిపోతావని మాత్రమే చెబుతున్నా అంటూ మంత్రి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. దీంతో ఆమె కూడా మంత్రి గారికి ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్లిపోయింది. మంత్రి సమక్షంలోనే జరిగిన ఈ ఘటన అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తల్ని, నేతల్ని కూడా ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది. అసలే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయం కూడా కావడంతో సాధ్యమైనంతగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ… జగనన్న సురక్ష ధృవపత్రాలు ఇస్తామంటూ జనాన్ని రప్పిస్తోంది. ఇలాంటి కార్యక్రమంలో ఓ మహిళ ఇలా షాకిస్తుందని మాత్రం అక్కడున్న ఏ ఒక్కరు ఊహించి ఉండరు. ఐతే ఈ మహిళా అటువంటి సమాధానం ఇవ్వడానికి కారణం ఆమె ఆలోచనలలో ఉన్న గందరగోళమా లేక స్పష్టతా అనేది ఆ శివయ్యకే ఎరుక.