ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న కొంతమంది వైసిపి ప్రజా ప్రతినిధులు ప్రజల తిరుగుబాటుకు గురవ్వడం మనం ప్రతిరోజూ చూస్తూ వున్నాము. ఇలా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు కొందరికి చేదు అనుభవాలు ఎదురవగా తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి అలాంటి ఓ చేదు అనుభవమే ఎదురయ్యింది. కరణం ధర్మశ్రీ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడనే విషయం అందరికీ తెలిసినదే. కాగా ఆయన తాజాగా తన నియోజకవర్గం ప్రజలనుండే తీవ్రమైన వ్యతిరేకతకి గురయ్యాడు.
గడపగడపకు కార్యక్రమంలో ఆయన ఓ గ్రామానికి వెళ్లగా అక్కడి ప్రజలు, ముఖ్యంగా యువత ఆయనపై తిరగబడ్డారు. గ్రామంలో ఏం అభివృద్ధి చేసారని మీరు గడపగడపకు వస్తున్నారని ప్రశ్నించారు. దాంతో ఖంగుతిన్న ఎమ్మెల్యే టైం బాలేదని వెనుదిరిగాడు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఎదురవ్వడం మనం చూశాం. కొంతకాలం క్రితం తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. ఉద్దండ్రాయునిపాలెం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్యెల్యే శ్రీదేవికి సొంత పార్టీ వారి నుండే వ్యతిరేకత ఎదురవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.
అదేవిధంగా ఆమధ్య గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన వైకాపా ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకి కూడా ఇలాంటి అనుభవం ఎదురవ్వడం మనం కళ్లారా చూసాము. ఎన్టీఆర్ జిల్లా కొడవటికల్లుకి చెందిన ఓ కుర్రాడు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు మన ఎమ్మెల్యేని. మన రాజధాని ఏదని సదరు వ్యక్తి ప్రశ్నించగా.. దానికి జవాబు ఏం చెప్పాలో తెలియని ఎమ్మెల్యే నీకు తెలియదా? అంటూ ఎదురు ప్రశ్నవేసి అక్కడినుండి నిష్క్రమించాడు.
అదేవిధంగా మాజీ మంత్రి శంకరనారాయణకు అయితే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్ళినప్పుడల్లా చేదు అనుభవం ఎదురవుతూ వుంది. రొద్దం మండలం శేషాపురంలో ఆయన పర్యటించినపుడు గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదంటూ ఎమ్మెల్యేని స్థానికులు ప్రశ్నించి ఉక్కిరిబిక్కిరి చేసారు. అదేవిధంగా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌కు కూడా అలాంటి చేదు అనుభవం ఎదురైంది. వేపగుంట ముత్యమాంబ పండుగలో స్టేజీల ఏర్పాటు విషయంలో అదీప్‌రాజ్‌ను స్థానిక యువకులు ముట్టడించి గ్రామ దేవత పండుగలో రాజకీయాలు చేస్తారా అంటూ నిగ్గదీసి అడగడం కలకలం రేగింది. వేపగుంట ముత్యమాంబ పండుగకు సంబంధించి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగు స్టేజీలు విషయంలో ఈ రచ్చ జరిగింది. దీనికి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ కారణమని భావించిన యువకులు.. పినగాడి నుంచి వేపగుంట వైపు వెళుతున్న ఎమ్మెల్యే కారును ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు కలిసి అడ్డగించగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆఖరికి పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో స్థానికులు కలగజేసుకుని.. ఎమ్మెల్యేను కారెక్కించి అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ఇలా వైసిపి ఎమ్మెల్యేలు ఎక్కడికెళ్లినా ప్రజలు ఎదురుతిరుగుతున్న పరిస్థితి వుంది.