మెగా కుటుంబం ఎన్నో సంవత్సరాల నిరీక్షణ మొన్న ఫలించింది. రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఇటీవలే తల్లిదండ్రులయ్యారు. 2012లో వివాహమైన వీరికి చాలా కాలం తరువాత పండంటి ఆడబిడ్డ జన్మించింది. దాంతో మెగా కాంపౌండ్ లో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంలోనే వీరిద్దరికి సంబంధించిన పలు విషయాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా మెగాభిమానులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. రామ్ చరణ్ గురించి అందరికీ తెలిసినదే. ప్రేక్షకుల్లో ఉపాసనకు కూడా ఒక ప్రత్యేక స్థానముంది. తన వ్యక్తిత్వంతో ఎక్కువ మంది అభిమానులను ఉపాసన సంపాదించుకుంది. అపోలో ఆస్పత్రి పనులతోపాటు తన సొంత వ్యాపారాల్లో కూడా బిజీ గా ఉంటుంది.
ఉన్నత కుటుంబం నుండి వచ్చిన ఉపాసన విదేశాల్లో ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. చదువు పూర్తి అయిన వెంటనే వ్యాపార రంగంలో అడుగుపెట్టి మంచి పేరు గడించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బి పాజిటివ్ అనే మ్యాగజైన్ ఇన్ చార్జిగా ఉపాసన ఉన్నారు. ఇంత సంపాదన ఉన్న ఉపాసన చాలా నిరాడంబరంగా ఉండటంతోపాటు బంధాలకు చాలా విలువనిస్తారు. అత్తమామలు చిరంజీవి, సురేఖ అంటే విపరీతమైన గౌరవం, మర్యాద చూపిస్తూ వుంటారు. తనకు వీలైనప్పుడు మంచి కౌన్సిలింగ్ పాఠాలు కూడా చెబుతూ వుంటారు.
ఉపాసన చాలా ఇండిపెండెంట్ వుమన్. తనకంటూ కెరీర్ మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. పెళ్లి అయిందే తడవుగా చాలామంది ఆమెను రకరకాలుగా ట్రోల్స్ చేసారు. పిల్లల విషయంలో ఐతే ఇంకా దారుణంగా ట్రోల్ చేసారు. ఐతే వాటిని ఆమె పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు. సమాజం కోసం కాకుండా ఎట్టకేలకు వారికి నచ్చినప్పుడు ఆ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వీరికి బిడ్డ జన్మించిందని తెలియగానే పరిశ్రమనుండి అనేకమంది ప్రముఖులు అపోలో ఆసుపత్రికి పయనమయ్యారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు.
మెగా కుటుంబానికి, ఘట్టమనేని కుటుంబానికి వున్న అనుబంధం గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా చిరు – మహేష్ బంధం చాలా పవిత్రమైనది. మహేష్ సినిమా విడుదలైనప్పుడు మొట్టమొదటిసారిగా ఫోన్ చేసి విష్ చేసేది మన చిరునే. ఈ విషయం మహేష్ చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటాడు. ఇక చాలా గ్యాప్ తరువాత రామ్ చరణ్ తండ్రి అయ్యాడనే విషయం తెలిసాక మహేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే షూటింగ్ స్పాట్ నుండి తన కార్ వ్యాన్ లోనే అపోలో ఆసుపత్రికి బయలుదేరి వెళ్ళాడట మహేష్. ఇక మహేష్ రాకను గమనించిన చరణ్ చాలా ఆనందంతో తన బిడ్డను మహేష్ చేతికి అందించి మురిసిపోయాడట.