టాలెంట్ అనేది ఎవడబ్బసొత్తు కాదు. ఇంకా చెప్పాలంటే దానికి వయస్సుతో కూడా సంబంధం లేదు. అవును, వయస్సుతో అస్సలు సంబంధమే లేకుండా తమకున్న స్వశక్తితో, టాలెంట్ తో అంచెలంచెలు ఎదుగుతూ కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ అవుతున్నవారు ఇక్కడ ఎంతమందో వున్నారు. అయితే ఆ వయసుకి కూడా ఓ పరిమితి ఉంటుంది. కేవలం 15 సంవత్సరాల వయస్సున్న ఓ కుర్రవాడు అద్భుతం చేసాడంటే మీరు నమ్ముతారా? అవును, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందనే విషయాన్ని ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక బుడ్డోడు రుజువు చేసి చూపాడు. కట్ చేస్తే వందల కోట్ల రూపాయల ఆస్తికి అధిపతి అయ్యాడు.
అతడు మరెవ్వరో కాదు తిలక్ మెహతా. గత కొన్ని రోజులుగా మీడియాలో వినబడుతున్న పేరు ఇది. తనకొచ్చిన ఓ బిజినెస్ ఐడియాతో తిలక్ మెహతా చిన్న వయస్సులోనే ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడు. తనకు వచ్చిన సమస్యనే వ్యాపారంగా మార్చుకుని వందల కోట్లు సంపాదిస్తున్న ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇంకా వయస్సులో ఉండి కూడా యేమి చేయలేకపోతున్నామనుకొనేవారు తప్పక స్ఫూర్తి పొందుతారు.
తిలక్ మెహతా ఒకరోజు తన దగ్గర ఉన్న బుక్స్ తీసుకుని మేనమామ ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఆ పుస్తకాలను అక్కడే మరిచి పోయాడు. డెలివరీ సర్వీస్ ద్వారా ఆ బుక్స్ ను తెప్పించుకోవాలని అనుకున్నాడు. అయితే దానికి ఖర్చు మరీ ఎక్కువ మొత్తం ఉండటంతో ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో మేనమామ ఇంట్లో ఉన్న పుస్తకాలను ఎంత కష్టపడినా తన ఇంటికి మాత్రం తెప్పించుకోలేకపోయాడు. ఇలాంటి సమస్యలతో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న తిలక్ మెహతా ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం దొరికితే బాగుంటుందని అప్పుడే అనుకున్నాడు.
ఆ సమయంలోనే ముంబై డబ్బావాలా గుర్తుకు వచ్చింది అతనికి. వారిని ప్రేరణగా తీసుకుని పేపర్ అండ్ పార్శిల్స్ పేరుతో కస్టమర్లకు అవసరమైన అన్ని వస్తువులు ఒకే రోజులో డెలివరీ అయ్యేలా తిలక్ మెహతా ఓ కంపెనీని మొదలు పెట్టారు. పోస్టల్ సేవల కంటే తక్కువ ఖర్చుతో ఈ బిజినెస్ ను మొదలుపెట్టి షిప్పింగ్, లాజిస్టిక్స్ సర్వీసులను కూడా అందులో చేర్చాడు మెహతా. ప్రస్తుతం తిలక్ నెలవారీ ఆదాయం 2 కోట్ల రూపాయలుగా ఉంది అంటే మీరు నమ్ముతారా? ప్రస్తుతం ఈ సంస్థ టర్నోవర్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. ప్రత్యేక నైపుణ్యాలు ఉంటే వయస్సుతో సంబంధం లేకుండా సక్సెస్ కావచ్చని తిలక్ మెహతా ప్రూవ్ చేశారు.