టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేషమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అతను ఎక్కడ కాలుపెట్టినా తండోపతండాలుగా ప్రజలు తరలివస్తున్నారు. సోమవారం నాడు నెల్లూరు జిల్లాలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. యువగళం పాదయాత్ర 145వ రోజులో నెల్లూరు జిల్లాకు లోకేష్ వెళ్లారు. ఆ జిల్లా ప్రజలంతా లోకేష్ కి ఘన స్వాగతం పలికారు. ఈరోజు ఆయన విజయవంతంగా నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా చిన్న పిల్లలు, మహిళలు, యువకులు ముసలి వాళ్లు అందరూ లోకేష్ వద్దకు వచ్చి కరచాలనం చేశారు. మీరే కాబోయే సీఎం కావాలంటూ తమ మద్దతు తెలిపారు.
దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డికి వచ్చిన రెస్పాన్స్ మళ్లీ లోకేష్ కే వచ్చింది అనడంలో సందేహం లేదు. అంతే కాదు లోకేష్ పై పూల వర్షం కురిపించారు నెల్లూరు జిల్లా వాసులు. అది చాలాదన్నట్టు తమ ప్రేమను చూపించడానికి వారు ఒక పెద్ద పూలదండను క్రేన్ తో తీసుకొచ్చి మరీ లోకేష్ పై వేశారు. ఈ పాదయాత్ర మొత్తంలో ఇదే హైలైట్ గా మారింది. జై లోకేష్, జై టీడీపీ అనే నినాదాలతో జిల్లా అంతా మారుమోగేలా అరిచారు.
లోకేష్ పాదయాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అతను 2024లో జరగనున్న ఏపీ ఎన్నికలలో కచ్చితంగా భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురువేస్తారని తెలుస్తోంది. ప్రస్తుత సీఎం జగన్ కరెంటు బిల్లులు ఇంకా తదితర విషయాల్లో సమర్థవంతంగా పరిపాలన చేయలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే లోకేష్ కి ప్లస్ పాయింట్ అయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు చాలామంది జీవితాల్లో వెలుగులు నింపాయి. మరి ప్రజలు సంక్షేమ పథకాలు వైపు మొగ్గు చూపుతారా లేదంటే అభివృద్ధి కావాలని టిడిపికే ఓటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.