నెల్లూరు సాక్షిగా ఎమ్మెల్యే అనీల్ కుమార్ – కోటంరెడ్డి బ్రదర్స్ వార్… ఛాలెంజులు విసురుకుంటున్న వైనం?

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి నారాయణపై నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసినదే. గత కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించేందుకు డబ్బులు పంపారని, అయితే ఆ డబ్బులు వాపస్ పంపానని చెప్పుకొచ్చారు. సందర్భం రానందున ఇన్నాళ్లు ఈ విషయం ఎక్కడా బయట పెట్టలేదని అన్నారు. అక్కడితో ఆగకుండా నెల్లూరులో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్‌ల పరిస్థితి అయితే చాలా హేయనీయం అని అన్నారు. పేపర్ చూసి సరిగా చదవలేని లోకేష్ తనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని, దానికి కోటం రెడ్డి బ్రదర్స్ లోకేష్ ని ఆకాశానికెత్తేయడం అయితే ఇంకా కామెడీగా ఉందన్నారు. గ్రామ సింహం తోక పట్టుకుని గోదారి ఈదినట్లుంది ఈ టీడీపీ నేతల పరిస్థితి అంటూ దుయ్యబట్టారు.

ఈ నేపథ్యంలో సీఎం తనను ఛీపో అన్నది లోకేష్ బూత్ రూములో ఉండి విన్నారా? అంటూ సెటైర్లు వేశారు. యువగళంకు వస్తున్న స్పందనను చూసి సీఎం జగన్‌ జడుసుకుంటున్నారని లోకేష్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. తనను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా ఆపే దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో వచ్చి పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ విసిరారు. తనకు టికెట్ రాదంటున్న చవటలు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించాలని అన్నారు. ఇంకా ఈ సందర్భంగా లోకేష్ ప్రసంగాన్ని చూసి టీడీపీ నేతలే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్.

అయితే, అనీల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై తాజాగా కోటంరెడ్డి బ్రదర్స్ స్పందించడం జరిగింది. ధైర్యముంటే అనిల్ ఎదురుగా వచ్చి ఆ మాటలు మాట్లాడాలని ఛాలెంజ్ విసిరారు కోటంరెడ్డి బ్రదర్స్. ఈ నెల్లూరులో ఎవరి సత్తా ఏమిటో రానున్న ఎలక్షన్లో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ముందు పేపర్ చూసి చదవడం గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారికి అనిల్ నేర్పించాలని కౌంటర్ వేశారు. మొన్నటికి మొన్న పవన్ యాత్ర చేస్తున్న వారాహిని వరాహిగా పలికిన జగన్ కి తెలుగు అక్షరాలు వీలైతే నేర్పించు అనిల్ అని సూచించారు. నిన్నగాక నిన్న రాజకీయాల్లోకి వచ్చిన అనిల్ మాకు రాజకీయం నేర్పించొద్దని కోటంరెడ్డి బ్రదర్స్ అన్నారు.

దమ్ముంటే నారాయణ దోపిడీ చేసిన దానిపైన అనిల్ కి ఎమన్నా సమగ్ర సమాచారం ఉంటే నిరూపించాలని డిమాండ్ చేసారు. ఊరికే కల్లబొల్లి కబుర్లు ఆడితే ప్రజలు నమ్మరని హితవు పలికారు ఈ బ్రదర్స్. ఇంకా కోటంరెడ్డి బ్రదర్స్ అనిల్ ని ఉద్దేశించి మాట్లాడుతూ… నారాయణ విద్యాసంస్థలుపైన ఆరోపణలు చేసిన ఈయనే తన బంధువర్గానికి, సన్నిహితుల పిల్లలను అక్కడ చదువుకోవమని సలహాలు ఇస్తూ వుంటారు. అంతటి పేరున్న విద్యాసంస్థలు పైన రాజకీయం కోసం అనవసరంగా మాటలు తూలితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు.