ఎక్స్ ప్లాట్‌ఫామ్‌గా మారిపోయిన ట్విట్టర్.. కొత్త ప్లాట్‌ఫామ్ విజన్ ఏంటో చెప్పిన సీఈవో లిండా..

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (Twitter)ను నేటితో అంటే 2023, జులై 24తో పూర్తిగా మార్చేశారు ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్. ఈ అపర కుబేరుడు ట్విట్టర్‌ మాతృ సంస్థను ఎక్స్ (X) కార్పొరేషన్‌గా, ట్విట్టర్‌ లోగోను Xగా మార్చేశారు. ట్విట్టర్ సీఈఓ లిండా యాకరినో “లెట్స్ డూ దిస్” అంటూ తాజాగా కొత్త లోగోను కూడా రిలీజ్ చేశారు. “X” అక్షరంతో కూడిన కొత్త లోగో యూజర్లలో ఆసక్తిని రేపుతోంది. ఈ లోగో ఆల్రెడీ ఉన్న ఐకానిక్ లోగో బ్లూ బర్డ్ స్థానాన్ని భర్తీ చేస్తుంది.

Linda Yaccarino (Photo by Isaac Brekken/Variety/Penske Media via Getty Images)

ఈ కొత్త “ఎక్స్” లోగోతో ట్విట్టర్‌ని మరింత మెరుగ్గా మార్చామనే సంకేతం ఇస్తున్నట్లు సీఈవో తెలిపారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, వీడియోలు, ఫొటోలు పంచుకోవడం, వీడియో, ఆడియో ద్వారా ఇంటరాక్ట్ కావడం, వస్తువులను కొనుగోలు చేయడం లేదా ఒకరికొకరు డబ్బు పంపుకోవడం వంటి అన్ని పనులకు వన్ స్టాప్ డెస్టినేషన్‌గా ఎక్స్‌ ప్లాట్‌ఫామ్ మారబోతోందని ఆమె స్పష్టం చేశారు. ఈ కొత్త “X” లోగో ప్రతి సర్వీస్ సాఫీగా జరిగేలా చేయడానికి ఏఐ సహాయాన్ని తీసుకుంటుందని కూడా ఆమె తెలిపారు.

 

ఈ కొత్త “X” లోగో ట్విట్టర్‌లో పెద్ద మార్పులను తీసుకువస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులను కనెక్ట్ చేసే ఆల్-ఇన్-వన్ ప్లాట్‌ఫామ్ అవుతుందని ఆమె అన్నారు. ఈ కొత్త “X” లోగోను వాస్తవంగా మార్చేందుకు మస్క్ వంటి తన బృందం, భాగస్వాములతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నానని వెల్లడించారు. ట్విట్టర్ రీ బ్రాండెడ్ వర్షన్ X ప్రతి ఒక్కరికీ ఎన్నో అద్భుతమైన పనులు చేయగల వేదికగా మారడానికి మరెన్నో రోజుల సమయం లేదని ఆమె పేర్కొన్నారు.

 

మస్క్ ట్విట్టర్‌ను ఎవ్రీథింగ్ యాప్‌గా మార్చాలని మొదటి నుంచి అనుకుంటున్నారు. ట్విట్టర్‌కు ఉన్న సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ దానిలో అన్ని సేవలను అందించి ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఏలాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నా, విమర్శలు వెనక్కి లాగుతున్నా అతను మాత్రం తన విజన్ ప్రకారమే ముందడుగులు వేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మెటా నుంచి బలమైన పోటీగా థ్రెడ్స్ యాప్ వచ్చినా సరే అదరక బెదరక తాను అనుకున్నది సాధించేలా మస్క్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు.