వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగు నగరం అనేది ముఖ్యంగా వైసీపీకి చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఇది జిల్లా కేంద్రం అయిన కడపకు 70 కి.మీ దూరంలో వ్యాపార పట్టణం ప్రొద్దుటూరుకు కేవలం 20 కి.మీ సమీపంలో ఉండడం వలన ఇక్కడ అభివృద్ధి బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఈ నగరం బాగా అభివృద్ధి చెందిందని అందరికీ తెలిసినదే. ఈ ప్రాంతాన్ని ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల కూడలి ప్రాంతం అని పేర్కొంటూ వుంటారు. ఈ గ్రామ అసలు నామం జంబుల మడక (రెల్లు లేదా తుంగ మొక్కలతో నిండిన చెరువు). కొంతకాలానికి ఈ ప్రదేశం రూపాంతరం చెంది జమ్మలమడుగుగా మారింది. ఇక ఇక్కడ వైసీపీకి తిరుగులేదనేది ఒకప్పటిమాట అని చెప్పుకోవాలేమో?
ఎందుకంటే ఇక్కడి ప్రజలు చాలామంది మెల్లమెల్లగా టీడీపీ పార్టీలోకి వలస పోతున్నారు. విషయం ఏమంటే వై యస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉన్నతి చూసిన ఈ నగరం నేడు అతని కొడుకు హయాంలో మాత్రం బోసిపోతుందని అక్కడి ప్రజలు వాపోతున్న పరిస్థితి. ఎక్కడి అభివృద్ధి పనులు అక్కడే ఉన్నాయని, ఉపాధి లేక యువత ఇబ్బందులు పడుతున్నారని, కరెంటు బిల్లులు పెరిగి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయనే కారణాలను చెబుతూ తాజాగా చాలామంది టీడీపీ పార్టీలోకి చేరి కండువాలు కూడా కప్పుకున్న పరిస్థితి వచ్చింది.
ఇక ఈ ప్రాంతాన్ని పూర్వం ములికినాడు అని పిలిచేవారు. ఆ విధంగా అది ఆనాడు ఉండేది. అయితే కాలక్రమేణా అది బాగా రూపాంతరం చెందింది. సుప్రసిద్ధమైన గండికోట జమ్మలమడుగు మండలంలోనే ఉందని చాలామందికి తెలియదు. ఇక జమ్మలమడుగుపై పూర్తి ఆధిపత్యం సాధించక తప్పని పరిస్ధితి వైఎస్ జగన్ కు ఇపుడు ఎదురవుతోంది అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో వైసీపీ పలుమార్లు గెలిచిన ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపైన ఇపుడు తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో ఆయన స్ధానంలో ఈసారి ఎన్నికల్లో తన సతీమణి వైఎస్ భారతిని ఎమ్మెల్యేగా బరిలోకి దించాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే ఇందులో పెద్ద వ్యూహమే నడుస్తోంది. భారతిని బరిలోకి దింపడం ద్వారా ఈ సీటును కూడా తమ కంచుకోటగా మార్చుకోవడంతో పాటు ఇక్కడ కడప స్టీల్ ప్లాంట్ కు ఎలాంటి ఇబ్పందులు లేకుండా చూసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే సుధీర్ రెడ్డికి మరో పదవి ఇచ్చేలా, రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చేలా జగన్ స్కెచ్ సిద్ధం చేసినట్లు సమాచారం. కొందరు రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే… ఈసారి జగన్ ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ జమ్మలమడుగు చేజారిపోతుందనేది వారి వాదన. ఈ విషయం తేలాలంటే మరో సంవత్సరం ఆగాల్సిందే! ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం… నెలల వ్యవధిలోనే తేటతెల్లం అయిపోతుంది.