బాహాటంగానే జగన్ పై రెచ్చిపోయిన ఆర్‌. నారాయణమూర్తి?

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని ఏడాది పాటు ప్రతి నెల 4న ధర్మారావు ఫౌండేషన చైర్మన్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో గడిచిన ఆదివారం రాత్రి స్థానిక అద్దేపల్లి వారి సత్రంలో కొన్ని కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. దానికి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు, ప్రముఖ సినీ నటుడు, మనందరి దర్శక నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి విశిష్ఠ అతిధిగా విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ… మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరలపై సాగించిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత కెనాల్‌ రోడ్డులోని అల్లూరి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడ నుంచి సభా వేదిక వద్దకు కాగడాల ప్రదర్శనతో చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వేదిక వద్ద ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 10 మంది యువకులు రక్తదానం చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్ర మాలను నిర్వహించారు. ఎమ్మెల్యే నిమ్మల అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ మంత్రి పితాని సత్య నారాయణ, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌, డాక్టర్‌ సిహెచ్‌ సత్యనారాయణ మూర్తి (బాబ్జీ), మంతెన సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.

దాంతో ఈ సభ మరింత శోభాయమానంగా తయారయ్యింది. ఈ నేపథ్యంలో మనందరి పీపుల్ స్టార్ ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ… ప్రజలను పట్టి పీడిస్తూ దోపిడీ విపరీతంగా పెరిగిపోయిన గడ్డు పరిస్థితుల్లో దైవాంశ సంభూతులు లాంటివారు పుడతారని, ఈ క్రమంలోనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించదానికి 26 ఏండ్ల అతిపిన్న వయస్సు కలిగిన అమరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు పుట్టాడని అభివర్ణించారు. స్వేచ్ఛావాయువులు పీల్చుతూ స్వయం పాలన కోసం సాగిన స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి గొప్ప స్ఫూర్తిని రగిలించారని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే అలాంటి రాక్షస పాలన నేడు కూడా కొన్ని చోట్ల కొనసాగుతోందని…. ప్రజలు గ్రహించాలని, పాలకులు ఇంకా ఎరుకతో వ్యవహరించాలని ఈ సభావేదికగా హెచ్చరించారు.

దాంతో ఈ మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఓ వర్గం వారు ఈ మాటలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడిన హెచ్చరిక మాటలు మా ఏపీ ప్రభుత్వానికి బాగా సరిపడతాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సభావేదికపైన మరింతమంది ప్రముఖులు ఆశీనులవడం జరిగింది. క్షత్రియ సంక్షేమ పరిషత్‌ కార్యవర్గ సభ్యులు, దిగుపాటి రాజగోపాల్‌, తెలుగు మహిళ రాష్ట్ర ఉపా ధ్యక్షురాలు కర్నేన రోజారమణి, నరసింహారావు, గౌరునాయుడు, చేగొండి సూర్య ప్రకాష్‌, గొట్టుముక్కల రఘురామరాజు, కళింగ లక్ష్మణరావు, కె.రఘు రామరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అశోక్‌ గజపతిరాజు, మంతెన వెంకటరామరాజు, వేగేశ్న ఆనందరాజు, పెన్మెత్స వెంకటపతిరాజులను ఘనంగా సత్కరించారు.