రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ ప్రతిభ గురించి మనం మాట్లాడుకోవలసిన పనిలేదు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఆయన దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో అందరికీ విదితమే. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లిన వర్మ మూడు నాలుగు హిట్ చిత్రాలను అందించి సూపర్ పాపులర్ అయ్యాడు. అంటే దాదాపు ఓ దశాబ్దకాలం పాటు ఆయన హవా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇక ఆ తరువాత ఏమయ్యిందో తెలియదు గాని, పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తూ తనపేరు తానే చెడగొట్టుకున్నాడు. ఈ క్రమంలో అనేకమంది పేరున్న సెలిబ్రిటీలపైన లేనిపోని పంచులు వేస్తూ తన స్థాయి దిగజార్చుకున్నాడు. అందుకే జనాలు ఆయనని ఇపుడు కేవలం వివాదాల వర్మగానే గుర్తిస్తున్నారు.
గత కొన్ని సంవత్సరాలనుండి టాలీవుడ్లో పాగా వేసిన వర్మ ముఖ్యంగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పనికిమాలిన ట్వీట్స్ చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి అమ్ముడుపోయిన వర్మ జనసేనాని పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాలు వైసీపీకి అనుకూలంగా, మిగతావారికి ప్రతికూలంగా తీస్తున్నాడు. అయితే ఈ సినిమాలు జనాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే గతంలో అలా తెరకెక్కిన సినిమాల పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసినదే.
ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్, చిరంజీవి ల లుక్ ను రివీల్ చేశాడు. ఈ మేరకు ఓ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు ఆర్జీవి. ‘వ్యూహం’ సినిమాను ముందుగా విడుదల చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ మూవీ గురించి వరుసగా అప్డేట్ లు ఇస్తూ వస్తున్నాడు వర్మ. అందులో పవన్ చిరంజీవితో ఏదో మాట్లాడి తిరిగి వెళ్లిపోతున్నట్టుగా తెలుస్తోంది. కాగా ఈ పోస్టర్ రిలీజ్ అయినప్పటినుండి సోషల్ మీడియాలో వర్మతో మెగాభిమానులు ఒక ఆట ఆడుకుంటున్న పరిస్థితి. రామ్ గోపాల్ వర్మ గత ఎన్నికల సమయంలో కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీసి అభాసుపాలయ్యాడు. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు.
ఇక అసలు విషయంలోకి వెళితే, జనసేనాని వారాహి యాత్ర ఎంత దిగ్విజయంగా సాగుతుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో జనాల మధ్య నుండి వర్మ సంగతి ఏంటి? అనే ప్రశ్న రాగానే పవన్ కళ్యాణ్ ఓ రేంజులో వర్మని చెడుగుడు ఆడుకున్నాడు. ప్రస్తుతం సినిమాల చేసే స్థితిలో లేని వర్మ అధికార పార్టీ పెట్టిన భిక్షతో పబ్బం గడుపుతున్నాడని, ఈ నేపథ్యంలో ప్రత్యర్దులపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని, అంతా గమనిస్తున్నాని… 100 తప్పులకు దగ్గరలో వున్నాడని.. ధర్మానికి కూడా సహనం ఉంటుందని, ఒక్కసారి ఆ సహనం కోల్పోతే పర్యవసానం చాలా దారుణంగా ఉంటుందని వర్మను హెచ్చరించారు జనసేనాని.