అనిల్! నెల్లూరు ట్రంక్ రోడ్డులోనే ఉన్నా… ఎక్కడ దాక్కున్నావ్, బయటికి రారా సిల్లీ ఫెలో: నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 146వ రోజు నెల్లూరు నగరంలో దిగ్విజయంగా కొనసాగింది. దారిపొడవునా లోకేష్‌ను చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలి వచ్చిన వైనాన్ని మనం గమనించవచ్చు. పాదయాత్ర చేస్తున్న దారిలో మహిళలు, యువకులు వందలాదిమంది భవనాలపై నిలబడి ఆయనకు అభివాదం చేశారు. ఈ క్రమంలో విచిత్ర వేషధారణలు, డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో సింహపురి అయితే మార్మోగిందని చెప్పుకోవచ్చు. రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు నగర ఇంఛారజ్ పొంగూరి నారాయణ ఆధ్వర్యంలో వేలాది కార్యకర్తలు అక్కడికి తరలి వచ్చారు.

ఇక 146వరోజు లోకేష్ 8.6 కి.మీ. మేర పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1901.2 కి.మీ. మేర వరకు కొనసాగడం విశేషం. ఇక నెల్లూరులో యువగళం పాదయాత్రకు భారీగా జనం తరలిరావడంతో.. లోకేష్ అడుగు తీసి అడుగు ముందుకు వేయలేకపోతున్న పరిస్థితి నెలకొంది. ఒక్క కిలోమీటర్‌ నడిచేందుకు గంటన్నర సమయం పట్టిందంటే ఆయనపై జనాకర్షణ ఏ విధంగా వుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ లోకేష్‌ ముందుకు సాగిపోయారు. దారులన్నీ పసుపు పూల వనాన్ని తలపించాయి. సింహపురి గడ్డపై టీడీపీ సత్తా చూపిస్తామని ఆ పార్టీ నేతలు ఈ సందర్భంగా అంటున్నారు.

ఇక నెల్లూరు విఆర్సి జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగసభకు అయితే నగరం నలుమూలల నుండే కాకుండా చుట్టుపక్కల వారు కూడా కొన్ని వేల సంఖ్యలో వచ్చారు. కరెంట్ ఛార్జీలు, ఇంటిపన్నులు విపరీతంగా పెరిగిపోయాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కూరగాయల రేట్లు, నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయని లోకేష్‌కు చెప్పి తమగోడుని వెళ్లబుచ్చుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో… నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ పై లోకేష్ ఒక రేంజులో విరుచుకు పడ్డారు. లోకేష్ మాట్లాడుతూ… “నోటికి అడ్డదిడ్డంగా ఏది పడితే అది వాగే అనిల్ కి ఒక్కటే చెబుతున్నా. మీకు రోజులు దగ్గర పడ్డాయ్. ఇక మీరు సర్దుకోవలసిందే. కొంచెం ఆచితూచి మాట్లాడితే బావుంటుంది. నెల్లూరు వస్తే ఏదో పీకుతానన్నావ్ కదా. అనిల్! నెల్లూరు ట్రంక్ రోడ్డులోనే ఉన్నా… ఎక్కడ దాక్కున్నావ్, బయటికి రారా సిల్లీ ఫెలో… భయపడ్డావ్ కదూ!” అని గట్టిగా అనేసరికి టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా తమ కరతాళధ్వనులతో సభను దద్దరిల్లేలా చేసారు. ఇకపోతే తనను కలిసేందుకు వస్తున్న ప్రజల్ని లోకేష్ పలకరిస్తూ.. వారిని అక్కన చేర్చుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. అటు.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.