పరువునష్టం కేసులో జీవితారాజశేఖర్ దంపతులకు షాకిచ్చిన నాంపల్లి కోర్టు… ఏడాదిపాటు జైలుశిక్ష!

టాలీవుడ్ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులు గురించి తెలుగువాళ్ళకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తొంబైవ దశకంలో వీరి హవా బాగా నడిచింది. నేటికీ రాజశేఖర్ అడపాదడపా సినిమాలలో నటిస్తూ తన ఉనికిని చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే జీవితారాజశేఖర్ వారసురాళ్లు అయినటువంటి శివాని మరియు శివాత్మిక హీరోయిన్లుగా ఎదగడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరుగాంచిన రాజశేఖర్ తొలినాళ్లలో తలంబ్రాలు, అంకుశం, ఆహుతి సినిమాలతో సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన కుమార్తెలు కూడా ఆయన బాటలోనే సాగుతున్నారు. ఇక నటి జీవిత గురించి అందరికీ తెలిసినదే. కుమార్తెలు శివాత్మిక, శివాని ఇద్దరూ తల్లిదండ్రుల నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్టే కనబడుతోంది.

ఆమధ్య తమ పిల్లల గురించి మాట్లాడుతూ జీవిత భావోద్వేగానికి గురైన సంగతి విదితమే. దొరసాని సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక కొంచెం గ్యాప్‌ తర్వాత తెలుగులో పంచతంత్రం సినిమాలో నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో జీవితా రాజశేఖర్‌ స్పెషల్‌ గెస్టుగా హాజరైన సందర్భంలో మాట్లాడుతూ చాలా ఎమోషనల్‌ అయ్యారు. పిల్లలిద్దరూ చిన్నప్పటి నుంచి సినీ వాతావరణంలోనే పెరిగారని, చిన్నప్పటి నుంచి వాళ్లకు ఏం కావాలన్నా ఆస్తులు అమ్మి అయినా సరే కొనిచ్చామని, అయితే సినిమాల్లో రాణించడం, మంచి పాత్రలు లభించడం, ఫేమ్ రావడం అనేది డెస్టినీ మీద ఆధారపడి ఉంటుందని, డబ్బుతో వీటిని కొనలేమని వారికి చెప్పామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటివరకు వారు చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోయినా నటీమణులుగా మాత్రం మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు.

ఇక అసలు విషయంలోకి వెళితే… 2011లో జీవిత, రాజశేఖర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పైన చేసిన ఆరోపణల కేసులో వారికి ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. రక్తం అందక ఎవరూ ప్రాణాలు పోగొట్టుకోకూడదన్న మంచి ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నడుపుతుంటే రాజకీయంగా లబ్ది పొందడానికి జీవిత, రాజశేఖర్ దంపతులు సదరు బ్లడ్ బ్యాంక్ పై 2011లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్లడ్ బ్యాంక్ పేరుతో దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కాగా ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెనుదుమారాన్నే సృష్టించాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై అల్లు అరవింద్ అప్పట్లో కోర్టుని ఆశ్రయించి చిరంజీవి పేరుతో జరుగుతున్న సేవా కార్యక్రమాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పరువునష్టం దావా వేశారు.

ఇకపోతే సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మంగళవారం నాడు తీర్పు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో జీవిత, రాజశేఖర్ దంపతులకు రూ.5000 జరిమానాతో పాటు ఏడాది శిక్ష జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే జరిమానా చెల్లించడంతో వారికి పైకోర్టుకి వెళ్లే అవకాశం కల్పిస్తూ బెయిల్ మంజూరు చేయడం కొసమెరుపు. కాగా మొదటినుండి జీవితారాజశేఖర్ దంపతులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మెగా ఫ్యామిలీపైన పడి ఏడుస్తున్న సంఘటనలు మనం అనేకం చూసాము. అయితే ఈ క్రమంలో వారు 2011లో చేసిన వ్యాఖ్యలను చాలా సీరియస్ గా తీసుకుంది మెగా కుటుంబం. దాంతో జీవితారాజశేఖర్ దంపతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.