వర్షాకాలం కావడంతో ఈ సంవత్సరం దేశమంతటా వర్షాలు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ప్రజలకు తీరని విషాదాన్ని మిగిల్చాయనే చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వరదల బీభత్సానికి మొత్తం 17 మంది మృతి చెందినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జలప్రళయానికి ఇళ్లు, కాలనీలు, గ్రామాలే కాదు పట్టణాలు, నగరాలు సైతం జలమయంగా మారడం ఈ సంవత్సరమే జరిగింది. గత వారంలో దాదాపు మూడు నాలుగురోజులు ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు, వదలతో భారీగా ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం, పంటనష్టం జరిగింది. ఇక వర్షాలు కాస్త తగ్గినప్పటికి వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఇప్పటికే వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 4 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది.
అదేవిధంగా తక్షణ సాయం కింద 25 వేల రూపాయలు మంజూరు చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ ఇటీవల పేర్కొన్నారు. వరద బాధితుల కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ కూడా ఇచ్చారు. ములుగు జిల్లాలో అత్యధికంగా వరదల్లో చనిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మంది మరణించినట్లుగా తెలుస్తోంది. హనుమకొండ జిల్లాలో ముగ్గురు, మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు, భూపాలపల్లి జిల్లాలో ఒకరు చనిపోయారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ముగ్గురు వరదల్లో కొట్టుకుపోయి మృత్యువాతపడ్డారు. పలువురు గల్లంతవగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా వరదలతో చాలా చోట్ల కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరిగింది. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
వరంగల్-హైదరాబాద్ హైవేతో పాటు వరంగల్ ఏటూరునాగారం ప్రధాన రహదారి వరద నీటికి పూర్తిగా కొట్టుకుపోయింది. ఆసియాలోనే అతిపెద్ద జాతర జరిగే మేడారం గ్రామాన్ని అయితే జంపన్నవాగు నీరు పూర్తిగా జలమయం చేసేసింది. దాంతో అక్కడి జనం తిండి, నీరు లేక అవస్థలు పడ్డారు. పలువురు ప్రాణాలు కాపాడుకునేందుకు వరదనీళ్లలో చిక్కుకొని కొట్టుకుపోయినట్టు సమాచారం. జాతర సమయంలో వేర్వేరు ప్రాంతాల నుంచి కోటిన్నర మంది తరలివచ్చే ఈ గ్రామం ఇప్పుడు వరదనీటిలో మునిగిపోవడం ఒకింత బాధాకరం. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితిన అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నారు. మేడారంతో పాటు చుట్టు పక్కల ఉన్న కొండాయి, మల్యాల గ్రామాల్లో కూడా వరదనీరు చేరుకుంది. చుట్టు పక్కల వాగు ఉధృతంగా ప్రవహించడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించి ఏడుగురు గల్లంతయ్యారు.
కాగా అక్కడి పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే సీతక్క పరిశీలిస్తున్నారు. కాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. తెలంగాణ వరదబాధితులకు తమవంతు సాయంగా కొన్ని కోట్ల రూపాయిలు అందజేసినట్టు తెలుస్తోంది. ఆ సదరు మొత్తాన్ని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి అందజేసినట్టు సమాచారం. ప్రభుత్వం ద్వారా మహేష్ సాయం వరద బాధితులకు అందనుంది. ఇక మన సూపర్ స్టార్ కి సాయం చేయడం కొత్తకాదు. కొన్ని లక్షల గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించిన ఉదార స్వభావుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రజలకు ఎప్పుడు కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆయన ఎప్పుడూ ముందుకొస్తాడు.