ఎట్టకేలకు కన్నతల్లి దగ్గరికి చేరిన అమృత ప్రణయ్?

అమృత ప్రణయ్‌.. గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2018లో పరువు హత్య విషయంలో ఈ జంట దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. అమృత వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న నెపంతో ఆమె తండ్రి, బాబాయ్‌ ఆమెపైన, భర్త ప్రణయ్ పైన కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో ప్రణయ్‌ను చంపి కూతుర్ని ఇంటికి తీసుకురావాలని పధకం రచించారు. కూతురు కడుపుతో ఉందని చూడకుండా అల్లుడి మర్డర్‌కు ప్లాన్‌ వేశారు. అమృతకు చెకప్‌ చేయించటానికి ఆసుపత్రికి వెళ్లిన ప్రణయ్‌పై ఓ కాంట్రాక్ట్‌ కిల్లర్‌తో అతికిరాతకంగా దాడి చేయించారు. ఈ దాడిలో ప్రణయ్‌ కత్తివేటుకి బలయ్యాడు.

ఈ విషయం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ హత్య విషయంలో అమృత తండ్రి దేశవ్యాప్తంగా విమర్శల పాలయ్యాడు. ఈ క్రమంలో అమృత తండ్రి జైలు పాలయ్యారు. ఆ తరువాత మారుతీరావు మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చిన ఆయన ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవనంలో ఆత్మహత్య చేసుకుని మరణించారు. అయితే తండ్రి మరణం తర్వాత కూడా అమృత తన ఇంటికి వెళ్లలేదు. అదేవిధంగా ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. తన బిడ్డలోనే ప్రణయ్ ని చూసుకుంటూ కాలాన్ని వెళ్లబుచ్చుతోంది. ఉపాధికోసం ఓ యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి వీడియోలు చేస్తూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని మెంటైన్ చేస్తోంది.

అయితే తాజాగా అమృత తన తల్లిదగ్గరకు వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం ఆమె తన యూట్యూబ్ ద్వారా తెలియజేసింది కూడా. దాంతో ఆమె అభిమానులు ఆమె మంచి నిర్ణయం తీసుకుందని, ఆమెకి కూడా కాస్త ఊరట దొరుకుతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె తన తల్లిని చూడడం కోసం మాత్రమే వెళ్లానని, అక్కడ వుండే ప్రసక్తి లేదని చెప్పుకు రావడం కొసమెరుపు. కాగా అమృత అంటే ఆమె తల్లికి అమితమైన ప్రేమ. వీరి ప్రేమ వ్యవహారం ఆమెకి అంగీకారమేనట. కాకపోతే మనది పురుషాధిక్యత కలిగిన దేశం కదా. అందుకని ఆమె తన భర్తని ఈ విషయంలో మందలించలేకపోయింది.

ఇకపోతే అమృత తాజాగా 18 నిమిషాల నిడివి కలిగిన ఓ వీడియో పోస్ట్ చేయగా అది కాస్త సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. తన స్నేహితురాలి ఎంగేజ్ మెంట్ కోసం బయలుదేరిన అమృత సదరు వీడియోని చాలా అందంగా రికార్డ్ చేసారు. దాంతో ఆ వీడియోని నెటిజనం బాగా చూస్తున్నారు. కాగా, అమృత ప్రణయ్‌ 30 జనవరి 2019న, సరిగ్గా మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా నిహాన్ ప్రణయ్ అనే బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె తన బిడ్డలో భర్త ప్రణయ్‌ని చూసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది.