కలెక్టర్ ముందే అధికారులను అడిగికడిగేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి?

జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన గురించి ఆయన ధైర్యం గురించి అందరికీ తెలిసిందే. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో మరోమారు హల్ చల్ చేసి దుమ్ము దులిపేసారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ గా ఉన్న నాగలక్ష్మిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తన చేతిలోని ఫిర్యాదు పత్రాలను ఆయన కలెక్టర్ ముందు టేబుల్ పై విసిరి కొట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా తనను నిలువరించేందుకు వచ్చిన కలెక్టర్ సెక్యూరిటీ గార్డును సైతం ఆయన తోసివేసే ప్రయత్నం చేసారని సమాచారం.

కలెక్టర్ తో పాటు ఆమె పక్కనే కూర్చుని ఉన్న జాయింట్ కలెక్టర్ తో కూడా ఆయన చెడుగుడు అడ్డుకున్నారని వినికిడి. దాంతో కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యాక్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకెళితే… తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో ప్రభుత్వానికి చెందిన రూ.70 కోట్ల విలువ చేసే 7 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందంటూ గత కొంతకాలంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఈ భూమిని కాపాడాలంటూ ఆయన ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో సోమవారం ఆయన కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి స్వయంగా హాజరు కావడం జరిగింది. ఈ భూవివాదంపై సమగ్ర వివరాలను సేకరించి ఆ పత్రాలను కలెక్టర్ కు అందించే యత్నం చేశారు.

ఈ నేపథ్యంలోనే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ఆయన నాగలక్ష్మిని ప్రశ్నించారు. దాంతో మీ ఫిర్యాదును పరిశీలిస్తామని, ఇక మీరు వెళ్లండి అంటూ కలెక్టర్ చెప్పడంతో జేసీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్పందన కార్యక్రమం అంటే ఏమిటో మీకు తెలుసా? అంటూ ఆయన నాగలక్ష్మిపై ఆయన విరుచుకుపడ్డారు. ఫిర్యాదుదారులు చెప్పే వివరాలను వినే ఓపిక లేనప్పుడు ఇక స్పందన కార్యక్రమం నిర్వహించడం దేనికి? అంటూ నిలదీశారు. తాను మాజీ ఎమ్మెల్యేనని, ప్రస్తుతం తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా కొనసాగుతున్నానని… తననే గో అంటూ వెళ్లగొడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటంటూ? ఆయన గట్టిగా నిలదీయడం జరిగింది.

అంతేకాకుండా ఈ సందర్భంగా ఇవిగో ఆ భూ ఆక్రమణకు చెందిన పత్రాలు అంటూ ఆయన తన చేతిలోని పత్రాలను కలెక్టర్ ముందు టేబుల్ పై విసిరి కొట్టడంతో స్థానికులు ఖిన్నులై చూస్తుండిపోయారు. కాసేపు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లతో వాదన సాగించిన జేసీ… ఆ తర్వాత కార్యాలయం నుంచి బయటకు వచ్చేసారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో సర్వత్రా ఆయనని ప్రశంసించడం జరుగుతోంది. ఈ విషయమై జనాలు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికే మద్దతు తెలుపుతున్నారు. నాయకుడు అంటే ఇలా ఉండాలని, అప్పుడే పై అధికారులనుండి కింది అధికారుల వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తారని అంటున్నారు. ఇక ఈ సందర్బంగా అక్కడే మీడియాతో మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి… ఐఏఎస్ అధికారుల విధులు ఏమిటో కూడా ఈ కలెక్టర్ కు తెలిసినట్లు లేవని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యేను అయిన తననే కలెక్టర్ గో అంటూ బయటకు వెళ్లగొడతారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.