ఈ ప్రపంచంలో ఎంతమంది భార్యాభర్తలు విడిపోరు? కానీ, ఈ సమాజానికి అవేవి అవసరం లేదు. సెలిబ్రిటీల జీవితాలైతే మనకి సమ్మగా ఉంటుంది. ఏమాత్రం అవకాశం దొరికినా ఇక్కడి మీడియాలు వారి బెడ్ రూములలోకి తొంగి చూడాలని అనుకుంటాయి. అందులోనూ మెగా ఫామిలీ విషయాలైతే వీరికి శునకానందం ఎక్కువే. ఎక్కడ సందు దొరుకుతుందా… రాయి విసురుదామా అని ఎదురు చూస్తూ ఉంటాయి. ఇక తాజాగా నాగబాబు ముద్దుల కూతురు నిహారిక విడాకుల విషయమై భూతద్దం పెట్టి మరీ వెతకడం స్టార్ట్ చేయడం ఒకింత బాధాకరమే.
అంతకు మునుపు జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక విడిపోవడానికి కారణం మెగా ఫామిలీ కారణమని ఆడిపోసుకున్న జనాలు ఆ తరువాత తండ్రి నాగబాబు చేసిన అతి గారాబమే అంటూ పిచ్చి రాతలు రాయడం మొదలు పెట్టారు. ఇక అది చాలదన్నట్టు తాజాగా ఆమె ఓ డాన్స్ మాస్టర్ తో కలిసి చేసిన డాన్స్ వీడియోనే వారి విడాకులకు కారణమయ్యింది అంటూ కోడై కూస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి వార్తలకు అడ్డుఅదుపు లేకుండా పోయాయి. తిమ్మిని బమ్మి చేస్తున్నారు, బమ్మిని తిమ్మి చేస్తున్నారు.
ఇకపోతే చైతన్య, నిహారికకు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు ఇటీవల విడాకులు మంజూరు చేసిన సంగతి విదితమే. ఏది ఏమైనా నిహారిక వివాహమైన తర్వాత అత్తగారింట్లో సర్ధుకుపోలేకపోయింది అనేది స్పష్టమౌతోంది. పెళ్లైన తర్వాత ఆమె నటించే విషయంలో భర్త చైతన్యతో పాటు అత్తారింటి ఆంక్షలు ఆమెను ఇబ్బంది పెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పెళ్ళికి ముంది నటించుకోమని చెప్పిన అత్తవారు పెళ్లి తరువాత అదేం కుదరదు అంటూ ఆంక్షలు విధించినట్టు భోగట్టా. ఈ విషయమే భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు కారణమైనట్లు తెలుస్తోంది. ఆ మనస్పర్థలే చివరకు విడాకులకు దారితీశాయి అని గుసగుసలు వినబడుతున్నాయి.
ఈ విషయంలో రాజీ కోసం నాగబాబు, మెగా ఫామిలీ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒకవైపు కూతురుకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలుస్తోంది. ఇకపోతే, వివాహమైన తర్వాత నిర్మాతగా నిహారిక వెబ్ సిరీస్ లు వరుసగా నిర్మిస్తూ వస్తోంది. అంతేకాకుండా ఆయా సినిమాలలో ఆమె నటిస్తోంది కూడా. ఈ క్రమంలో ఆమె కొన్ని విజయాలను కూడా అందుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతగా నిలబడాలని ప్రస్తుత లక్ష్యమని, అది తప్ప ఆమె ప్రస్తుతం మరేమీ ఆలోచించడం లేదని సమాచారం. ఇక ఆమె నటించిన డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోన్న విషయం విదితమే.