వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై విరుచుకుపడిన ఆనం రామనారాయణరెడ్డి?

మొన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసినదే. లోకేష్ పాదయాత్రలో ఆనం రామనారాయణరెడ్డి పాల్గొనడంపై స్పందించిన అనిల్ కుమార్ యాదవ్ ఆనం కుటుంబ పరువును లోకేష్ కాళ్ల దగ్గర పెట్టారని ఘాటైన విమర్శలు చేసారు. వార్డు మెంబర్‌గా గెలవలేని వ్యక్తి చుట్టూ ఆనం తిరుగుతున్నారని ఎద్దేవా చేసాడు అనిల్. అలాంటి ఆనం తన గురించి మాట్లాడడం చాలా చోద్యంగా ఉందని అన్నారు. ఇకపోతే, కొద్దిరోజులుగా నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్, ఆనం రామనారాయణరెడ్డిల మధ్య మాటల యుద్దం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.

రామనారాయణరెడ్డి తన అనైతిక రాజకీయాలతో ఆనం కుటుంబ చరిత్రను గంగపాలు చేసారని, ఆయనగాని ఈసారి నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తే అతని రాజకీయ జీవితాన్ని ముగించేస్తామని అనిల్ అన్నారు. ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని కూడా ప్రకటించారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన ఆనం.. వైసీపీ నాయకుల అడ్డగోలు వ్యాఖ్యల్ని అస్సలు పట్టించుకోనని అన్నారు. వైసీపీ నాయకులు నెల్లూరు జిల్లా రాజకీయాలను కలుషితం చేశారని దుయ్యబట్టారు.

ఈ క్రమంలో ఆనం ఫ్యామిలీని అంతం చేసే మగాడు ఇంకా పుట్టలేదురా బచ్చా! అంటూ అనిల్ పై ఘటు వ్యాఖ్యలు చేసారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర క్యాంప్ సైట్ వేదికగా మీడియాతో ఆనం ఈ మాటలు ఆడారు. మంచి వేడిమీద వున్న ఆనం ఈ సందర్భంగా మాట్లాడుతూ… “నువ్వు ఒరేయ్ తురేయ్ అంటే మేం అంతకుమించి మాట్లాడతాం.. ఒరేయ్ జగన్, తురేయ్ అనిల్! అంటే… నువ్వు, నీ నాయకుడు తల ఎక్కడ పెట్టుకుంటార్రా?” అంటూ బదులిచ్చారు ఆనం. “చీటికి మాటికి మా లోకేష్ బాబుని పప్పు… పప్పు అని అంటారు కదా! మా యువ నాయకుడు అమెరికాలో చదివాడు… మీ నాయకుడు ఏం చదివాడో, ఎక్కడ వెలగబెట్టాడో అనిల్? స్టాన్ ఫోర్డ్‌లో చదివిన లోకేశ్ పప్పా? పదోతరగతి తప్పిన సీఎం జగన్ పప్పా?” నువ్వే తేల్చి చెప్పాలని కౌంటర్ వేశారు.

అంతేకాకుండా.. కాగితాలు చూడకుండా సమాధానం చెప్పలేని మీ నాయకుడికీ ఏ సాయం లేకుండానే ఏకధాటిగా మాట్లాడగలిగే మా యువ నాయకుడికీ తేడా నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని ఆనం అనిల్ ని ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ నేతకు ఇంటర్నేషనల్ నోటీసు వచ్చిందని మాజీమంత్రి బహిరంగంగా చెబుతూ ఉంటే ముఖ్యమంత్రికి ఎందుకు స్పందించడంలేదో చెప్పు అంటూ నిలదీశారు. ఇంకా ఆనం కుటుంబాన్ని అంతంచేసే మగాడు ఇంకా పుట్టలేదురా బచ్చా అనిల్.. అంటూ ఘాటుగా మాట్లాడారు ఆనం. ఆయన చివరగా మాట్లాడుతూ… అనిల్ కుమార్ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాల్సిన బాధ్యత డీజీపీకి లేదా? అంటూ ప్రశ్నించారు.