Bathukamma : తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అంగరంగవైభవంగా జరిపించే పండుగలలో బతుకమ్మ సంబరాలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి . ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులు చేసే ఈ సంబరాలు ఆకాశాన్ని అంటేలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా విదేశాలలో సైతం బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు అంటే ఈ పండుగ యొక్క విశిష్టత ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు.ముఖ్యంగా ఆడపడుచులు మెట్టింటి నుండి పుట్టింటికి చేరుకొని రకరకాల పూలతో త్రికోణాకారంలో పేర్చి బతుకమ్మను చేసి పసుపు కుంకుమలతో అలంకరించి..
ఊరంతా ఒకచోట చేరి బతుకమ్మలను మధ్యలో పెట్టి చుట్టూ పాటలు పాడుకుంటూ.. ఆటలు ఆడుతూ సంబరాలు చేసుకోవడం ఆనవాయితీ. దసరా పండుగకు తొమ్మిది రోజుల ముందు ఎంగిలిపూల బతుకమ్మ దగ్గర నుండి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ వరకు ప్రతి ఇంట్లో కూడా బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి.. ఇక చిన్న పెద్ద.. ధనిక పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా అందరూ కలిసి చేసుకునే ఏకైక పండుగ బతుకమ్మ అని చెప్పవచ్చు.మగవాళ్లంతా కలిసి గూనుగు పువ్వు.. తంగేడు పువ్వు.. అంటూ రకరకాల పూలను సేకరించి తీసుకొస్తే ఆడవాళ్ళు అందంగా బతుకమ్మను ముస్తాబు చేసి సాయంత్రం ఒకేచోట చేరి బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మను పారే నీటిలోనే వదిలేయడం జరుగుతుంది.
అయితే ఇలా వదిలేయడం వెనుక గల కారణం ఏమిటి అంటే వర్షాకాలం ముగిసి చలికాలం ప్రారంభంలో వచ్చే బతుకమ్మ పండుగ సమయానికి నదులు.. వాగులు నిండి పొంగిపొర్లుతాయి. పారే నీటిలో గూనుగు పువ్వు.. తంగేడు పువ్వులను వేయడం వల్ల నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది. పర్యావరణానికి కూడా తోడ్పడుతుంది. అందుకే బతుకమ్మ పండుగ అనంతరం బతుకమ్మలను పారే నీటిలో ని వదులుతారు. అటు దైవత్వం పరంగా.. ఇటు సైన్స్ పరంగా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలకు కూడా ఆయురారోగ్యాలు కలుగుతున్నాయి.