ఏపీలోని ఒక సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ ఆఫీసర్ లంచాలకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. ఒక బాధితురాలు YSR నేతన్న నేస్తం పథకం కింద గత మూడేళ్లుగా లబ్ది పొందుతోంది. అయితే నాలుగో ఏటా పథకం ద్వారా డబ్బులు పొందడానికి ఆమె తగిన డాక్యుమెంట్స్ అందజేయడానికి తన భర్తతో సహా ఆఫీసుకు వచ్చారు. అయితే ఈ క్రమంలో తమ దగ్గర లంచం అడగడానికి శుభశంకర్ అనే వెల్ఫేర్ ఆఫీసర్ ప్రయత్నించాడని వారు బహిరంగంగానే ఆరోపించారు. ఈ ఆరోపణలను తోసి పుచ్చకుండానే సదరు ఆఫీసర్ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆరోపణలు చేసిన మహిళ ప్రకారం ఈ వెల్ఫేర్ ఆఫీసర్ అందరి వద్ద లంచాలు తీసుకుంటున్నాడు. లంచాలు లేనిదే నేతన్న నేస్తం పథకం ద్వారా డబ్బులను రానివ్వకుండా చేస్తున్నాడట. కాగా ఈ విషయమై బాధితురాలు మీడియా ముందు అలాగే పబ్లిక్ ముందు తన బాధను వెల్లబోసుకుంది. ఇలాంటి పేదవారిని లంచం అనే పేరుతో పీడించుకుంటున్న ఆఫీసర్లను వెంటనే డిస్మిస్ చేయాలని నెటిజెన్లు కోరుతున్నారు.
మరి కొంత మంది ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ ఒక్క ఆఫీసర్ మాత్రమే కాదని ప్రభుత్వ ఆఫీసుల్లో చాలామంది లంచగొండిలు ఉన్నారని, వారందరినీ సామాన్య ప్రజలుగా మనం నిలదీయాలని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ వీడియో వైరల్ కాగా ఉన్నత అధికారులు అతనిపై సస్పెన్షన్ వేటు వేశారా లేదా అనేది ఇంకా తెలియ రాలేదు. ఇక జగన్ సర్కార్ ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.