Pawan Kalyan: తెలంగాణ లోని పవన్ కల్యాణ్ అభిమానులకి సూపర్ న్యూస్ !

Pawan Kalyan: జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన తర్వాత ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. తొందరలోనే అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణాలో పర్యటిస్తారని నాదెండ్ల చెప్పారు. చౌటుప్పల్, హుజూర్ నగర్ లో చనిపోయిన ఇద్దరు పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించటానికి పవన్ ప్రోగ్రామ్ పెట్టుకోబోతున్నారు. పై రెండు కుటుంబాలకు తలా రు. 5 లక్షల విలువైన చెక్కులను అందించబోతున్నారు.

ఇంతకువరకు అయితే బాగానే ఉంది సమస్యలేదు. కానీ తెలంగాణాలో కూడా క్రియాశీలక సభ్యత్వాలను పెంచాలని, పార్టీ కార్యక్రమాలను యాక్టివేట్ చేయాలని, పార్టీ బలోపేతానికి అందరు కష్టపడాలని పవన్ పిలుపివ్వటమే ఆశ్చర్యంగా ఉంది. పవన్ తాజా నిర్ణయం చూసిన తర్వాతే తెలంగాణా మీదకేడూడా కన్నేశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజానికి ఒక ప్రాంతీయపార్టీ రెండురాష్ట్రాల్లో ఏకకాలంలో పొలిటికల్ యాక్టివిటి చేసే అవకాశంలేదు.

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ కూడా కావచ్చు రెండురాష్ట్రాల్లో రాజకీయం చేయలేకపోయాయి. తెలంగాణాలో టీడీపీ జెండా ఎత్తేస్తే జగన్మోహన్ రెడ్డి తెలివిగా ముందుగానే పార్టీని వైండప్ చేసేశారు. అందుకనే తన పూర్తి సమయాన్ని జగన్ ఏపీలో కేటాయించగలుగుతున్నారు. చంద్రబాబు కూడా ఓటుకునోటు దెబ్బకు విజయవాడుకు పారిపోయిన తర్వాత నుండి తన రాజకీయాన్ని ఏపీకి మాత్రమే పరిమితం చేసుకున్నారు.

మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత, కరోనా వైరస్ పుణ్యమాని తన మకాంను చంద్రబాబు హైదరాబాద్ కు మార్చారు. అందుకనే అప్పుడప్పుడు తెలంగాణా నేతలతో భేటీ అవుతుంటారు. అంతమాత్రాన తెలంగాణా యాక్టివిటీస్ లో చంద్రబాబు మళ్ళీ ఫుల్లుగా ఇన్వాల్వ్ అయిపోయారని కాదు. రెండు రాష్ట్రాల్లో కార్యక్రమాలు నడపటం సాధ్యంకాదు.

ప్రాంతీయపార్టీగా ఉండి రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న చరిత్ర దేశం మొత్తంమీద ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మాత్రమే దక్కింది. అదికూడా ఢిల్లీ యూనిట్ వేరుగా పంజాబ్ యూనిట్ వేరుగా ఏర్పాటుచేయటం వల్లే ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలోకి రాగలిగింది. పవన్ ఫ్యాన్ బేస్ ఎక్కడుంది అని కాకుండా పుట్టి, పెరిగిన ప్రాంతం అనే కోణంలో పవన్ ఏపీకి మాత్రమే పరిమితమైతే బాగుంటుంది.

పైగా తెలంగాణాలో అధికార టీఆర్ఎస్ ఒకవైపు బీజేపీ మరోవైపు, కాంగ్రెస్ ఇంకోవైపు రాజకీయాలను ఫుల్లురేంజిలో చేస్తున్నాయి. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని కేసీయార్, ఎలాగైనా అధికారం అందుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలను వేడెకించేస్తున్నాయి. మధ్యలో జనసేనకు ఉన్న అవకాశం బాగా తక్కువనే అనుకోవాలి. కాదు కూడదని రెండు రాష్ట్రాలపైనా ఏకకాలంలో పవన్ దృష్టిపెడితే మాత్రం ఇబ్బంది పడిపోవటం ఖాయం. కాబట్టి పవన్ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే రెంటికి చెడ్డ రేవడిగా అయిపోతారు.