Pawan Kalyan: పవన్ మనసులో మాటేంటో అర్ధం కావటంలేదే ?

Pawan Kalyan:  ఎన్నికలకు మహావుంటే మరో రెండేళ్ళుందంతే. ఇప్పటినుండే జగన్మోహన్ రెడ్డి కసరత్తు మొదలుపెట్టేశారు. మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో ఈమధ్యే సమీక్ష నిర్వహించి చెప్పాల్సిందంతా చెప్పారు. నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించుకుంటున్న విషయాన్ని స్పష్టంచేశారు. తన సర్వేలో ఫీడ్ బ్యాక్ మంచిగా ఉన్నవారికే టికెట్లిస్తానని ఇందులో మొహమాటానికి తావులేదని కూడా స్పష్టంగా చెప్పారు. నేతలకన్నా తనకు పార్టీయే ముఖ్యమన్న విషయాన్ని తేల్చి చెప్పేశారు.

ఇదే సమయంలో చంద్రబాబునాయుడు కూడా లోలోపలే నియోజకవర్గాలు, అభ్యర్ధులు, ఆశావహులపై సర్వేలు చేయించుకుంటున్నారు. రెండు ప్రధానపార్టీల అధినేతలు సర్వేలు చేయించుకోవటంలో బిజీగా ఉంటే మరి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి చేస్తున్నారు ? ఇదే ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇప్పటికైతే బీజేపీ-జనసేనలు మిత్రపక్షాలని అందరికీ తెలిసిందే. కానీ వచ్చే ఎన్నికల్లో వీళ్ళేద్దరే పోటీచేస్తారా ? లేకపోతే టీడీపీని కూడా కలుపుకుంటారా ? అనే విషయంలో క్లారిటిలేదు.

ఒక విషయం అయితే తెలుస్తోంది. అదేమిటంటే బీజేపీతో చంద్రబాబు కలవాలని అనుకుంటున్నా కమలనాదులే కుదరదు పొమ్మంటున్నారు. అలాగే జనసేనతో కూడా చంద్రబాబు పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. అయితే చంద్రబాబు పంపిన లవ్ ప్రపోజల్ కు పవన్ ఇంకా అధికారికంగా ఎలాంటి సమాధానం చెప్పలేదు. కానీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
సందర్భంగా పవన్ మాట్లడుతు ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వను అన్నారు. అంటే అర్ధమేంటి ? కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను వదిలేసినా టీడీపీతో పొత్తుపెట్టుకోవాలని మనసులో ఉన్నట్లే కదా. అంటే అవకాశముంటే చంద్రబాబును కూడా తమతో కలుపుకోవాలని పవన్ కు బలంగా ఉన్నట్లే అనిపిస్తోంది.

అయితే ఇందుకు బీజేపీ ఒప్పుకోవటంలేదు కాబట్టి పవన్ ఏమి చేస్తారో తెలీటంలేదు. ఇక్కడే పవన్ మనసులోని మాటను వెంటనే బయటపెట్టి ఆచరణలోకి తీసుకురావాలి. అదేమిటంటే పొత్తులో జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేయబోతోంది ? అనే విషయంలో నేతలకు క్లారిటి ఇవ్వాలి. బీజేపీతో మాత్రమే పొత్తుంటుందా లేదా అవసరమైతే బీజేపీని వదిలేసి చంద్రబాబుతో కలుస్తారా ? అనేది తేల్చాలి. బీజేపీతోనే ఉండేట్లయితే మేజర్ షేర్ జనసేన అభ్యర్ధులే పోటీచేస్తారు.

కానీ టీడీపీతో పొత్తుండేట్లయితే జనసేనది మైనర్ షేర్ మాత్రమే అవుతుంది. ఒకవేళ మేజర్ అయినా మైనర్ షేరయినా జనసేన ఎన్నోకొన్ని సీట్లలో పోటీచేయాలి కదా ? ఎన్ని సీట్లలో పోటీచేస్తుందనేది పవన్ ఇష్టమే కానీ అభ్యర్ధులను అయితే రెడీ చేసుకోవాలి కదా. నిర్దిష్టంగా ఇన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తుందనే లెక్క తేలకపోతే అభ్యర్ధులు ఎలా రెడీ అవుతారు ? చివరి నిముషంలో అభ్యర్ధులను ఎంపికచేస్తే వాళ్ళ పోటీకి ఎలా రెడీ అవుతారు ? ఇవన్నీ చూస్తే పవన్ వెనకబడినట్లే అనిపిస్తోంది. ఇప్పటికైనా స్పీడందుకోకపోతే పవన్ ఇబ్బందపడటం కష్టమే. కాబట్టి ఇప్పటికైనా పవన్ మనసులోని మాటను బయటపెట్టి పొత్తుల విషయం ఖాయం చేసుకోవాలి. లేకపోతే కష్టమే.