Sunday, May 22, 2022

Bjp: బీజేపీ మిత్రధర్మం పాటిస్తోందా ?

Bjp:  ఈ విషయంలోనే అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. మామూలుగా మిత్రపక్షాలంటే ఒకపార్టీ నేతపై ప్రత్యర్ధులు ఆరోపణలు, విమర్శలు చేసినపుడు మిత్రపక్ష పార్టీ కూడా ధీటైన సమాధానం చెబుతుంది. తమ మిత్రపక్షానికి మద్దతుగా ప్రత్యర్ధులపై కౌంటర్లతో విరుచుకుపడుతుంది. కానీ ఇక్కడ బీజేపీ ఆ పనిచేస్తున్నట్లు ఎక్కడా కనబడటంలేదు. జనసేన-బీజేపీ మిత్రపక్షాలన్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో వైసీపీకి టీడీపీకి ఏమాత్రం పడటంలేదు. ఇదే సమయంలో వైసీపీకి జనసేన మధ్య సంబంధాలు కూడా ఉప్పు-నిప్పులాగ తయారైపోయింది. ఈ మూడు పార్టీల నేతల మధ్య వ్యవహారం విధానాలు, సిద్ధాంతాల స్ధాయిని దాటిపోయి వ్యక్తిగతంగా దూషించుకునే స్ధాయికి చేరుకునేసింది. అందుకనే రాజకీయ వాతావరణం మొత్తం కలుషితమైపోయింది. రాజకీయ ప్రత్యర్ధులు కాస్త రాజకీయ శతృవులుగా మారిపోయారు.

మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలు, అధికారపార్టీ నేతలకు పవన్ కల్యాణ్ తో పెద్ద వివాదమే నడుస్తోంది. అయితే అధికారపార్టీ నేతల ఆరోపణలు, విమర్శలకు అయితే పవన్ లేకపోతే జనసేన నేతలు మాత్రమే కౌంటర్లు ఇస్తున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం పెద్దగా స్పందించటంలేదు. మంత్రులు, ఎంఎల్ఏలు అంటున్నది తమ మిత్రపక్షం నేతనే అయినా తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారంతే.

ఇదే సమయంలో నరేంద్రమోడిపై ఇతర పార్టీల్లో ఎవరైనా ఏమైనా ఆరోపణలు, విమర్శలు చేస్తే పవన్ లేదా జనసేన నేతలు వెంటనే స్పందిస్తున్నారు. అదే పద్దతిలో ఎవరైనా పవన్ను అంటే బీజేపీ నేతలు మాత్రం రెస్పాండ్ కావటంలేదు. ఇక్కడే మిత్రపక్షం ధర్మంమీద అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. పైగా కమలనాదులు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా జనసేన నేతలకు సరైన సమాచారం కూడా ఉండటంలేదు. కేంద్రమంత్రులు లేదా కేంద్రంనుండి నేతలు వచ్చినపుడు జాయింట్ మీటింగులు కూడా ఉండటంలేదు.

ఇవన్నీ చూసిన తర్వాత మిత్రపక్షాల పొత్తులపైనే జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. పేరుకి మిత్రపక్షాలే కానీ రెండుపార్టీలు కలిసి ఆందోళనలు, నిరసనలు చేసిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి. ఎన్నికలు చూస్తేనేమో రెండేళ్ళలోనే జరగబోతున్నాయి. మిత్రపక్షాల మధ్య సరైన సఖ్యత ఉన్నట్లు కనబడటంలేదు. దీనివల్ల బీజేపీకి జరిగే నష్టం ఏమీలేదు. ఎందుకంటే బీజేపీ పెట్టుకున్నదే గోచీ కాబట్టి ఆది ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే.

కానీ పవన్ పరిస్ధితి అదికాదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. మరి పవన్ కోరిక బీజేపీతో తీరుతుందా ? ఇప్పటికిప్పుడే ఈ విషయం పవన్ ఆలోచించుకుని అడుగులు ముందుకెయ్యాలి. లేకపోతే రెండోసారి కూడా దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకోవటం తప్పదు. మిత్రపక్షమంటే అన్నీ విషయాలోను నిజాయితీతో ఉండాలి. అంతేకానీ తమనంటే మాత్రమే స్పందిస్తామని, తమ మిత్రపక్షాన్ని అంటే తమకేమీ సంబంధం లేదని కూర్చుంటే ఇద్దరు నష్టపోక తప్పవు. కాబట్టి రెండుపార్టీలు ఒకసారి కూర్చుని చర్చించుకుని తమ ఎజండాను రెడీ చేసుకోవాల్సిందే

Related Articles

- Advertisement -

తాజా వార్తలు