Janasena: ఎదుర్కోవటానికి పవన్ రెడీగా ఉండాల్సిందేనా ?

Janasena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో ఎల్లోమీడియా వైఖరి మారిపోతోంది. ఇంతకాలం పవన్ విషయంలో నెగిటివ్ కామెంట్లు చేయకుండా, నెగిటివ్ ప్రచారం చేయకుండా ఎల్లోమీడియా చాలా ఓపికేపట్టింది. ఎందుకంటే ఎప్పటికైనా చంద్రబాబునాయుడుతో పొత్తుంటుందని చంద్రబాబు మీడియా ఎదురుచూస్తోంది. ఇదే సమయంలో బీజేపీతో చంద్రబాబుకు పొత్తు కుదిర్చే బాధ్యత పవనే తీసుకుంటాడని చాలాకాలంగా వెయిట్ చేస్తోంది.

అయితే బీజేపీ-చంద్రబాబు పొత్తు కుదర్చటం పవన్ వల్ల సాధ్యం కాదని అర్ధమైపోయినట్లుంది. అందుకనే మెల్లిగా పవన్ కు వ్యతిరేకంగా కథనాలు మొదలుపెట్టేశారు. పొత్తు విషయంలో ఢిల్లీలో బీజేపీ పెద్దల దగ్గర పవన్ మాట చెల్లుబాటు కాలేదని చెప్పింది. అలాగే పవన్ను టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దని బీజేపీ నేతలు సలహా ఇచ్చినట్లు కూడా రాసుకొచ్చింది.


2029కి చంద్రబాబుకు వయసు అయిపోతుంది కాబట్టి అప్పుడు టీడీపీ జనేసేనలో కానీ బీజేపీలో కానీ విలీనమైపోతుందని చెప్పారట. అప్పుడు పవనే సీఎం అవ్వచ్చని అంతవరకు ఓపికపట్టమని చెప్పారట. అయితే బీజేపీ పెద్దలు ఏమిచెప్పినా పవన్ మాత్రం అవసరమైతే బీజేపీని వదిలేసి టీడీపీతో చేతులు కలపటానికి సిద్ధంగా ఉన్నట్లు జనసేన ముఖ్యనేతలు చెప్పినట్లు ఎల్లోమీడియా చెప్పింది. జనసేనలో ఉన్నది ఇద్దరు నేతలు. మొదటి వ్యక్తి పవన్ అయితే రెండో నేత నాదెండ్ల మనోహర్. ఈ ఇద్దరిలో ఎల్లోమీడియాకు ఈ విషయాలు ఎవరు చెప్పినట్లు ?
అంటే మొదటి అంకంలో బీజేపీ పెద్దల దగ్గర పవన్ పప్పులుడకలేదని ప్రపంచానికి ఎల్లోమీడియా చాటింపేసింది. ఇక రెండో అంకం ఏమిటంటే బీజేపీ నుండి జనసేనను విడగొట్టడం. మూడో అంకానికి వచ్చేసరికి టీడీపీ-జనసేనకు పొత్తు కలపటమే ధ్యేయంగా ఎల్లోమీడియా పనిచేస్తోంది. ఏ కారణం వల్లయినా టీడీపీ-జనసేన పొత్తు కుదరకపోతే అప్పుడు పవన్ కు మీడియా పరంగా సమస్యలు మొదలవుతాయి.

ఇపుడు చూపుతున్న సాఫ్ట్ కార్నర్ అంతా పూర్తి వ్యతిరేకంగా మారిపోవటం ఖాయం. జగన్మోహన్ రెడ్డిపై ఎల్లోమీడియా ఎంతటి విషం చిమ్ముతోందో అదే పద్దతిలో వపన్ వెంటకూడా పడుతుంది. దానికి పవన్ ఇప్పటినుండే మానసికంగా ప్రిపేర్ అయ్యుండాలి. చంద్రబాబు రాజకీయప్రయోజనాలకు ఎవరు విరుద్ధంగా వెళ్ళనా, ఎవరు చంద్రబాబు దెబ్బకొట్టినా ఎల్లోమీడియా ఏమాత్రం తట్టుకోలేందు.

2019 ఎన్నికల్లో చంద్రబాబును జగన్ చావుదెబ్బ కొట్టాడుకాబట్టే జగన్ పై ఎల్లోమీడియా పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది. రేపటి ఎన్నికల్లో మళ్ళీ జగనే గెలిస్తే చంద్రబాబు, టీడీపీతో పాటు ఎల్లోమీడియా భవిష్యత్తు కూడా అంధకారమైపోతుంది. అందుకనే ఎల్లోమీడియా జగన్ను జనాల ముందు పలుచన చేయటానికి ఇంతగా కష్టపడుతోంది. రేపు జగన్ తో పాటు జనసేన కూడా చంద్రబాబుకు వ్యతిరేకమే అని అర్ధమైతే పవన్ను కూడా ఏమాత్రం విడిచిపెట్టదు. వెంటపడి వెంటపడి తరుముతుంది. కాబట్టి పవన్ ఇప్పటినుండే అన్నింటికీ మానసికంగా సిద్ధపడుంటం చాలా మంచిది.