Janasena : ఇమేజి పెంచుకునేందుకు ఇదే మంచి అవకాశమా ?

Janasena :  ఇమేజి పెంచుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంచి అవకాశం వచ్చిందా ? క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే మొన్నటి జనవాణి కార్యక్రమం తర్వాత పవన్ మీడియాతో మాట్లాడుతు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయాన్ని కేంద్రప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పారు. తాను విశాఖ స్టీల్స్ విషయాన్ని టేకప్ చేయబోతున్నట్లు ప్రకటించారు. నిజంగా పవన్ గనుక చెప్పింది చిత్తశుద్దితో చేసేట్లయితే యావత్ ఉత్తరాంధ్రలో పవన్ కు మంచి ఇమేజి రావటం ఖాయం.

స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించద్దని ప్రభుత్వం రెండుమూడుసార్లు లేఖలురాసింది. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోయినపుడు నరేంద్రమోడీకి విజ్ఞప్తి కూడా చేశారు. ఇక వైసీపీ ఎంపీలు ఇదే విషయాన్ని పార్లమెంటు సమావేశాల్లో కూడా పదే పదే ప్రస్తావించినా ఉపయోగం లేకపోయింది. ఇక క్షేత్రస్ధాయిలో అంటే వైజాగ్ లోనే రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు, ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికసంఘాలు ఎంత ఆందోళనలు చేసినా ఉపయోగం కనబడటంలేదు. ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతలైతే సుమారు 600 రోజులుగా దీక్షలు చేస్తున్నా కేంద్రం దిగిరాలేదు.

ఒకవైపు ఆందోళనలు, దీక్షలు, వ్యతిరేకత పెరుగుతున్నా మరోవైపు కేంద్రం మాత్రం ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసే విషయాన్ని స్పీడుచేస్తోంది. ఇప్పటికే కొన్ని విభాగాలను ప్రైవేటుపరం చేసే విషయంలో టెండర్ నోటిఫికేషన్లను కూడా ఇచ్చేసింది. ఇదే విషయాన్ని పార్లమెంటులో కేంద్రమంత్రులు మాట్లాడుతు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసది చేసేదే అని స్పష్టంగా ప్రకటించేశారు. దీంతో నరేంద్రమోడీ ఆలోచన ఏమిటో అందరికీ అర్ధమైపోయింది. ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన సభల్లో పవన్ ఇప్పటికే రెండుసార్లు ప్రసంగించారు.


సో ఇదంతా చరిత్రలో కలిసిపోయినట్లయ్యింది. కాబట్టి ఇపుడు పవన్ తాజాగా ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను టేకప్ చేస్తానని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. పవన్ టేకప్ చేసినంత మాత్రాన ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగుతుందని అనుకునేందుకు లేదు. కాకపోతే ప్రయత్నం కూడా గట్టిగా చేస్తే కనీసం జనాల మద్దతు అయినా దక్కే అవకావముంది. ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖస్టీల్స్ ప్రైవేటీకరణ విషయాన్ని పవన్ టేకప్ చేయాలని అనుకుంటున్నారంటే బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నట్లు అర్ధమైపోతోంది.

పవన్ తీసుకోబోయే నిర్ణయంతో బీజేపీకి మండటం ఖాయం. దాంతో రెండుపార్టీలు విడిపోవటానికి భీజం పడబోతున్నదనే అనుకోవాలి. కనీసం 1 శాతం ఓట్లుకూడా లేని బీజేపీని మోయటం పవన్ కు పెద్ద సమస్యగానే తయారైంది. పైగా రాష్ట్రప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్న నరేంద్రమోడీ సర్కార్ కు మద్దతుగా పవన్ నిలవటమంటే పార్టీని తానే దెబ్బకొట్టుకుంటున్నట్లు. మరీ విషయం ఇప్పటికి వెలిగిందో ఏమోకానీ స్టీల్ ఫ్యాక్టరీ విషయాన్ని టేకప్ చేయటంతోనే పొత్తునుండి బయటకు వచ్చేయాలని పవన్ డిసైడ్ అయినట్లు అనిపిస్తోంది. నిజంగానే పొత్తునుండి బయటకు వచ్చి సిన్సియర్ గా ఫ్యాక్టరీ విషయాన్ని టేకప్ చేస్తే ఉత్తరాంధ్రలో జనసేనకు మంచి మైలేజి వచ్చేట్లుంది.