Pawan Kalyan : బీజేపీని పవన్ టెన్షన్లో పడేశారా?

Pawan Kalyan : తాజాగా జరిగిన పార్టీ విస్తృతస్ధాయి సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మిత్రపక్షం బీజేపీని టెన్షన్లో పడేశారా ? క్షేత్రస్ధాయిలో వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది అందరిలో. సమావేశంలో పవన్ మాట్లాడుతు మిత్రపక్షమైనంత మాత్రాన కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం ఏమి చేసినా అన్నింటికీ ఊ కొడతానని కాదన్నారు. 70 శాతం అంశాలపై ఏకీభవించవచ్చని మిగిలిన 30 శాతం అంశాలపై విభేదాలుంటే మాట్లాడుతానని చెప్పారు.

ఇపుడు కొత్తగా చెప్పిన 70:30 రేషియో గతంలో ఎప్పుడు చెప్పలేదు. అసలు కేంద్రప్రభుత్వ నిర్ణయాలను పవన్ ఏనాడు ప్రశ్నించలేదు. నరేంద్రమోడి సర్కార్ రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నా పవన్ నోరెత్తలేదు. అలాంటిది ఇపుడు హఠాత్తుగా 70:30 అంటు చెప్పటంతో బీజేపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకవున్నది రెండేళ్ళు మాత్రమే అని అందరికీ తెలిసిందే. నిజానికి బీజేపీతో మిత్రపక్షంగా ఉండటం వల్ల పవన్ కు నష్టమే కానీ లాభం ఏమీలేదు.

 

రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఓటుబ్యాంకు కనీసం 1 శాతం కూడా లేదు. పైగా రాష్ట్రప్రయోజనాలపై దెబ్బమీద దెబ్బ కొడుతోంది. దీంతో జనాలకు కేంద్రంపై బాగా మంటగా ఉంది. బీజేపీతో పొత్తు కంటిన్యు చేస్తే బీజేపీ మీద జనాలకున్న మంట జనసేన మీద కూడా పడటం ఖాయం. బహుశా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మిత్రపక్షంతో మెల్లిగా దూరం మైన్ టైన్ చేయటం మేలని పవన్ అనుకునుండచ్చు. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా డైరెక్టుగా చెప్పకుండా 70:30 రేషియోను పరోక్షంగా బయటకు తీశారు.

ఎప్పుడైతే పవన్ ఈ ప్రస్తావన చేశారో అప్పటినుండే కమలనాదుల్లో ఆలోచన మొదలైంది. రేపు అంటే ఎన్నికలకు ముందు పవన్ గనుక పొత్తును కాదనుకుంటే ఏమి చేయాలనే విషయంలో బీజేపీ నేతల్లో చర్చలు మొదలైంది. పొత్తును కాదని పవన్ వెళ్ళిపోయినా బీజేపీ చేయగలిగేది ఏమీ లేదని అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో తమతోనే పొత్తులో ఉండేదుంకు బీజేపీ చేయగలిగింది కూడా ఏమీలేదు. పొత్తును కాదని పవన్ వెళిపోతే బీజేపీ పరిస్ధితి చాలా దయనీంగా తయారవుతుంది.

ఎన్నికలకు ఇంకా రెండేళ్ళున్న కారణంగా పవన్ కూడా చాలా వ్యూహాత్మకంగా ఎక్కడా డైరెక్టుగా మాట్లాడటంలేదు. బీజేపీనే తనంతట తానుగా పొత్తు వద్దని తనతో చెప్పేట్లుగా చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉదాహరణకు టీడీపీని కూడా కలుపుకుంటేనే తమకు ఉపయోగమని బీజేపీపై పవన్ ఒత్తిడి తెచ్చే అవకాశముంది. ఒకవేళ చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ అంగీకరించకపోతే అప్పుడే ఎవరు తీసుకునే నిర్ణయాన్ని వాళ్ళు తీసుకునేట్లుగా పరిస్ధితులను సృష్టించే అవకాశాలున్నాయి. ఈ విషయాలన్నింటినీ కమలనాదులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. మరి పొత్తు విషయంలో ఎవరు ముందడుగు వేస్తారు ? రెండోపార్టీ ఏమి చేస్తుందనేది ఆసక్తిగా మారింది.