5G Technology : భారత దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో చీఫ్ ఆకాష్ అంబానీ.. మీడియాతో మంగళవారం మాట్లాడుతూ.. హైస్పీడ్ 5G టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం , విపత్తు నిర్వహణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేయడంలో సహాయపడుతుందని తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనలపై ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. నగరాలను స్మార్ట్‌గా మార్చడంతోపాటు సమాజాన్ని సురక్షితంగా మార్చడానికి అత్యాధునిక టెలికాం నెట్‌వర్క్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.
5జీ టెక్నాలజీని తీసుకొచ్చిన ఆరు నెలల్లోనే.. మిగితా మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని చెప్పారు. దేశం లోని 277 నగరాల్లో జియో ఒక్కటే 5జీ నెట్‌వర్క్ ఆధారంగా ట్రూ 5జీ సర్వీస్ ను ప్రారంభించిందని ఆయన అన్నారు. డిసెంబర్ ముగిసే సమయానికి దేశంలోని ప్రతి నగరం, గ్రామాలకు 5G సేవలను అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అని అన్నారు. ఇందుకోసం ప్రతి నెల మేము మా 5G నెట్‌వర్క్‌ను విస్తరిస్తామని చెప్పారు.
మారుమూల ప్రాంతాలకు 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు. 5G మన నగరాలను స్మార్ట్‌గా, సురక్షితంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది అత్యవసర సేవలను వేగవంతం తోపాటు పరిశ్రమను కూడా మరింత సమర్థవంతంగా చేస్తుందని తెలిపారు.