Avinash Reddy : వైఎస్ వివేకా ప్రాణాలు తీసిన కేసులో తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా సిబిఐను ఆదేశించాలంటూ ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇంప్లీడ్ అవ్వాలని వివేకా కుమార్తె సునీత నిర్ణయించారు. అవినాష్ పిటిషన్ లో సునీతకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఉండటంతో తమ వాదనలు వినిపించనున్నారు.సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ గురువారం తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు రెండు అభియోగ పత్రాలను సీబీఐ దాఖలు చేసిందని, వీటి ప్రకారం వివేకా కేస్ పై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాష్ రెడ్డి పిటిషన్ లో తెలిపారు.
వివేకా కేసు ఏకపక్షంగా వెళ్తుందని వివేకా రెండో పెళ్లి తర్వాత కుటుంబం దూరంగా ఉంటుందని ఆరోపణలు చేశారు. అవినాష్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.వివేకా రెండో భార్య కొడుకును వారసుడిగా ప్రకటించే ప్రక్రియలో వివేకా హత్య జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 2010లో షేక్ షమీమ్ అనే మహిళను వివేకా వివాహం చేసుకున్నారని, వివేకా రెండో వివాహంతో ఆయన కూతురు సునీతతో సంబంధాలు దెబ్బతిన్నాయని వివరించారు. 2015లో షమీమ్, వివేకాకు ఓ కుమారుడు పుట్టాడని, తమ కుటుంబం నుంచి దూరంగా ఉండాలంటూ వైఎస్ సునీత బెదిరించిందని సీబీఐకి ఇచ్చిన వాగ్మూలంలో షమీమ్ స్పష్టంగా చెప్పిందన్నారు.
వివేకా రెండో వివాహం తర్వాత కుటుంబసభ్యులు వివేకా చెక్ పవర్‍ను తొలగించారని, వైఎస్ సునీత, వివేకా సతీమణి అందరూ హైదరాబాద్‍లో ఉంటే వివేకా మాత్రం ఒంటరిగా పులివెందుల ఇంట్లో ఉండేవారని అవినాష్ రెడ్డి వివరించారు. షమీమ్‍కు పుట్టిన కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తారని చర్చ జరిగిందని వివేకా వారసత్వం ఎవరికి అన్న విషయంలో ఆయన హత్య జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. హత్య తర్వాత నిందితులు వివేకా ఇంట్లో డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు షమీమ్ చెప్పడం దీనికి బలం చేకూరుస్తుందన్నారు.