Pawan Kalyan: తెలంగాణాలో పవన్ ప్రయోగం చేస్తారా ?

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కూడా పోటీచేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రకటించారు. సొంతంగా పోటీచేసినా కనీసం 30 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలున్నట్లు పవన్ చెప్పారు. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయముంది. కాబట్టి ఈలోగా వచ్చే ఉపఎన్నికల్లో పోటీచేస్తే జనసేనకు జనాల్లో ఉన్న ఆధరణ ఎంత ? మరింతగా పెంచుకోవటం ఎలాగ అన్న విషయాలపై ఒక క్లారిటి వస్తుంది. ఇపుడిదంతా ఎందుకంటే తొందరలోనే మునుగోడు అసెంబ్లీకి ఉపఎన్నిక జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది.

నల్గొండ జిల్లాలోని మునుగోడుకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎంఎల్ఏ కాంగ్రెస్ ను వదిలేసి బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. తన రాజీనామ అంశం రోజుకొక మలుపు తిరుగుతోంది. పార్టీతో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామాచేసి పార్టీలో చేరాలని బీజేపీ గట్టిగా చెబుతోంది. అయితే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటం రాజగోపాల్ కు ఇష్టమున్నట్లు లేదు. కారణం ఏమిటంటే రాజీనామా చేసి ఉపఎన్నిక వస్తే మళ్ళీ బీజేపీ తరపున గెలుస్తామనే నమ్మకం ఉన్నట్లు లేదు.

సరే ఎంఎల్ఏకి రాజీనామా చేయటం, గెలుపో ఓటమో తేల్చుకోవటం రాజగోపాల్ సమస్య. ఉపఎన్నిక వస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు పోటీచేయటం ఖాయమే. మరపుడు పవన్ ఏమిచేస్తారు ? జనసేన తరపున అభ్యర్ధిని పోటీలోకి దించుతారా దించరా అన్నదే ప్రధానమైన పాయింట్. ఇక్కడ జనసేన తరపున పోటీలోకి దిగే అభ్యర్ధి గెలిచిపోతారని ఎవరు అనుకోవటంలేదు. అయితే అసలు జనాల్లో జనసేన స్టేటస్ ఏమిటనేది తెలియాలంటే ఉపఎన్నికలో కచ్చితంగా పోటీచేయాల్సిందే.

మునుగోడు ఉపఎన్నికను జనసేన ఒక ప్రయోగంగా భావించాలి. ఏదో పోటీచేశామంటే చేశామన్నట్లు కాకుండా మనసుపెట్టి జనసేన పోటీచేయాలి. అంటే పోటీచేసే అభ్యర్ధిని ఎంపిక చేయటం దగ్గరనుండి ప్రచారం, పోల్ మ్యానేజ్మెంట్ వరకు అన్నింటిలోను సీరియస్గా తీసుకోవాలి. అప్పుడే తెలంగాణాలో జనసేన ప్రభావం ఎంతన్నది తెలుస్తుంది. గట్టిఅభ్యర్ధిని రంగంలోకి దించటంతో పాటు ప్రచార బాధ్యతలను పవన్ గనుక నూరుశాతం తీసుకుంటే ఎన్నిక బాగా ఉత్కంఠగా మారుతుందనటంలో సందేహంలేదు.

ఎలాగు నిమినేషన్ వేసిన దగ్గరనుండి పోలింగ్ రోజుకు సుమారు రెండువారాల సమయం ఉంటుంది. కాబట్టి రోడ్డుషోలు, రెండు మూడు బహిరంగసభల్లో పవన్ పాల్గొంటే పార్టీ అభ్యర్ధికి ఆ ఊపేవేరు. మునుగోడు ఉపఎన్నికను గనుక జనసేన ఉపయోగించుకుంటే మిగిలిన పార్టీలతో జనసేనకు ఉన్న పోలికేమిటి ? ఏ పార్టీకన్నా ముందుంది ? ఏపార్టీకన్నా వెనకబడుంది ? అనే విషయం స్పష్టమైపోతుంది. దీనిబట్టి రాబోయే షెడ్యూల్ ఎన్నికలకు పక్కా ప్లాన్ తో రెడీ అయ్యే అవకాశముంటుంది. అంతేకానీ బీజేపీ రిక్వెస్టు చేసిందనో లేకపోతే ఇంకేదో కారణంతోనో ఉపఎన్నికలో పోటీచేయకుండా మానేస్తే మాత్రం షెడ్యూల్ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు.