Janasena: పవన్ విషయంలో జగన్ చెప్పింది ఎంతమంది నమ్ముతారు ?

Janasena:  వచ్చే ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాన్ పై పెద్ద ఆరోపణే చేశారు. కాపుల ఓట్లను హోల్ సేలుగా చంద్రబాబునాయుడుకు అమ్మేసేందుకు దత్తపుత్రుడు సిద్ధపడుతున్నట్లు జగన్ ఆరోపించారు. కాపుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఆలోచిస్తుంటే దత్తపుత్రుడు మాత్రం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల గురించే ఆలోచిస్తుంటారని ఎద్దేవాచేశారు. మూడో సంవత్సరం కాపునేస్త నిధులను విడుదల చేసేందుకు శుక్రవారం కాకినాడ సమావేశంలో పాల్గొన్నారు. కాపుల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాగా ముద్రపడిన తూర్పుగోదావరిలోనే పవన్ను డైరెక్టుగా జగన్ టార్గెట్ చేయటం ఆశ్చర్యంగా ఉంది.

చంద్రబాబు హయాంలో కాపుల సంక్షేమానికి ఏడాదికి వెయ్యి కోట్లని ప్రకటించిన చంద్రబాబు మొత్తంకలిపి సుమారు రు. 1500 కోట్లు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం మూడేళ్ళల్లో రు. 32, 296 కోట్లు వ్యయం చేసినట్లు చెప్పారు. కాపుల కోసం తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను గమనించి తమకు మద్దతుగా నిలబడాలని జగన్ రిక్వెస్టు చేసుకున్నారు. ఈ నేపధ్యంలోనే పవన్ పైన మండిపోయారు. చంద్రబాబు విషయంలో జగన్ చెప్పింది కరెక్టే అయ్యుండచ్చు కానీ పవన్ విషయంలో చేసిన ఆరోపణలే ఆశ్చర్యంగా ఉంది.


చంద్రబాబు, పవన్ ఎప్పుడూ తమ గురించి మాత్రమే ఆలోచించుకుంటారని జగన్ ఎద్దేవాచేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్, చంద్రబాబు, పవన్ ముగ్గురు కూడా ఉభయగోదావరిలోని సీట్లపైనే కన్నేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక సీట్లలో గెలిస్తే అధికారం తమదే అని ఎవరికివారుగా ఆంచనాలు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ముగ్గురు తరచూ తూర్పుగోదావరి జిల్లాలోనే పర్యటనలు పెట్టుకున్నారు. ఎవరెన్ని పర్యటనలు చేసినా ప్రత్యేకించి జనసేన విషయంలో కాపుల్లోనే కాకుండా ఇతర సామాజికవర్గాల్లో కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లు కీలకంగా మారబోతున్నాయి. ప్రతిసారి కాపుల ఓట్లు ఎవరికనే చర్చ జరగటం మామూలే అయినా వచ్చే ఎన్నికలు వైసీపీ, టీడీపీకి చాలా కీలకమైంది. అందుకనే కాపులను కాపుకాసేది తాము మాత్రమే అని జగన్ పదే పదే చెపుతున్నారు. చంద్రబాబు హయాంలో కాపులకు అన్యాయం జరిగినపుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరిప్పలేదని జగన్ సూటిగా ప్రశ్నించారు. కాపు సామాజికవర్గానికి చంద్రబాబు, పవన్ కన్నా తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమమే ఎక్కువని జగన్ వివరించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు, వైసీపీ ఓటమిని డిసైడ్ చేసేది జనసేనే అనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇందులో వాస్తవం ఎంతన్నది మరికొద్ది రోజులు ఆగితే కానీ స్పష్టంగా తెలీదు. ఈలోగా పవన్ కల్యాణ్ వ్యవహార శైలిపైనే క్లారిటి వచ్చే విషయం ఆధారపడుంది. ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ గనుక బాగా పట్టుగా తిరిగితే పరిస్ధితుల్లో మార్పులు రావచ్చని అనుకుంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.