Janasena : రాబోయే ఎన్నికల్లో జనసేనకు ఓటింగ్ శాతం పెరగటం ఖాయమని మెగా అభిమానులు చాలా బలంగా నమ్ముతున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఉన్న అపోహలు మెల్లిగా తొలగిపోతున్న కారణంగా మెల్లిగా నమ్మకం పెరుగుతోందన్నారు. పవన్ కల్యాణ్ పార్టీపెట్టినపుడు చాలామంది చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంపార్టీతో పోల్చి చూసుకున్న కారణంగానే జనాల్లో ఎక్కువమంది పార్టీకి దూరంగా ఉన్నట్లు చెప్పారు. అయితే చిరంజీవి లాగ పార్టీని మధ్యలోనే కాంగ్రెస్ తో విలీనం చేయరన్న నమ్మకం పెరిగిందన్నారు.
కొంత అనుమానాలు ఉన్న కారణంగానే 2019 జనరల్ ఎన్నికల్లో పార్టీకి పెద్దగా ఓటింగ్ రాలేదన్నారు. అయితే ఆ తర్వాత మెల్లిగా జనాల ఆలోచనల్లో మార్పువచ్చిందని చెప్పారు. ఎందుకంటే తర్వాత జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీకి ఓటింగ్ శాతం పెరగటానికి జనాల్లో పవన్ పై పెరిగిన నమ్మకమే కారణమన్నారు. చాలా జిల్లాల్లో వైసీపీ నేతల దెబ్బకు తెలుగుదేశంపార్టీ నేతలే పారిపోయిన చోట్లకూడా జనసేన నేతలు ఎదురునిలిచి పోరాటాలు చేసినట్లు మెగా అభిమానులు గుర్తుచేస్తున్నారు.
అధికార వైసీపీకి ఎదురునిలిచి పోరాడటమనే పద్దతి వల్లే జనాల్లో జనసేనపైన నమ్మకం తర్వాత అభిమానం పెరిగిందన్నారు. ఈ నమ్మకం, అభిమానం వచ్చే ఎన్నికలనాటికి బాగా పెరిగిపోతుందని చెప్పారు. ఎన్నో దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు అండ్ కో అయినా వైసీపీని ఎదురించలేక పారిపోతారేమో కానీ పవన్+జనసేన నేతలు మాత్రం పారిపోయే ప్రశక్తిలేదన్న విషయాన్ని జనాల దగ్గర పార్టీ స్పష్టంచేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కోస్తాజిల్లాల్లో ఎన్నిపార్టీలు అడ్డుపడినా, ఎవరెంత ప్రయత్నాలుచేసినా జనసేనకు 70 శాతం ఓటింగ్ రావటం ఖాయమన్నారు.
అలాగే రాయలసీమలో కూడా 50-60 శాతం జనాలు జనసేనకు మద్దతుగా ఓట్లు వేయబోతున్నారని మెగా అభిమానులు చెబుతున్నారు. జనసేన కేవలం కాపులపార్టీ అనే ముద్రనుండి బయటపడిందన్నారు. ఆ ముద్రకూడా కొందరు కావాలనే వేసిందని చెప్పారు. జనసేన అంటే కాపులే కాదు బీసీల్లోని అణగారినవర్గాలు, ఎస్సీల్లో కూడా ఆదరణ పెరుగుతున్నట్లు మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందనే ప్రచారం మెల్లిగా పెరుగుతున్నట్లు తెలిపారు.
విజయదశమి అయిన అక్టోబర్ 5వ తేదీనుండి పవన్ మొదలుపెట్టబోతున్న బస్సుయాత్ర తర్వాత జనాల ఆలోచనల్లో స్పష్టమైన తేడా కనబడుతుందన్నారు. పవన్ అభిమానులకు, మామూలు జనాలకు, వివిధ సామాజికవర్గాలకు తోడు మెగా అభిమానులు కూడా పవన్ కు మద్దతుగా నిలిస్తే జనసేనను ఎదుర్కోవటం మిగిలిన పార్టీలకు కష్టమన్నారు. ఈ విషయం తెలియటంతోనే జనసేనతో పొత్తులు పెట్టుకోవాలని ఆతృత చూపిస్తున్నట్లు చెప్పారు. అయితే పొత్తు విషయం పవన్ ఇప్పటికిప్పుడు ఏమీ ఆలోచించటంలేదని ఎన్నికల సమయంలో చూసుకుంటారన్నారు. మొత్తానికి జనసేనకు రాబోయే ఎన్నికల్లో ఎంత ఓటింగ్ శాతం వస్తుందనే విషయంలో మెగా అభిమానుల్లో పెద్ద అంచనాలే ఉన్నట్లు అర్ధమవుతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.