TDP : రానున్న ఎన్నికలకి ఇప్పటినుంచి మార్పులు చేర్పులు భారీగా జరుగుతున్నాయి.. మిగతా పార్టీల నాయకులు టిడిపిలోకి చేరుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా నేడు ఆయన సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు అని తెలుస్తుంది.
షాజహాన్ బాషా చేరికతో మదనపల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం అవుతుందని టిడిపి నాయకులు భావిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు షాజహాన్ బాషా ఓ వెలుగు వెలిగారు. వైఎస్‌కు అత్యంత ఆప్తుడిగా ఆయన పేరు గుర్తింపు పొందారు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి భారీ మెజారిటీ తో ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చతికిలపడటంతో.. ఆ పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. కాగా మూడు నెలల క్రితం ఏఐసీసీలో కీలక సభ్యుడిగా ఆయనకు ఢిల్లీ హైకమాండ్ అవకాశం కల్పించింది. అయితే ఆంధ్రరాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేకపోవడంతో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
యువగలం పాదయాత్రలో ఆయన అనుచరులు, అభిమానులతో కలిసి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. షాజహాన్ బాషా సోదరుడు నవాజ్ బాషా ప్రస్తుతం మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో రాజకీయంగా ఇద్దరూ ప్రత్యర్థులుగా మారారు. సోదరుడిని ఎదుర్కొనేందుకు ఇప్పుడు షాజహాన్ బాష టీడీపీలోకి వస్తున్నట్లు చెబుతున్నారు. దాంతో జగన్ కి కీలక అనుచరుడు మిస్.. టిడిపి కి ప్లస్ అయింది.