Telangana:సచివాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానమే అందలేదని రాజ్‌భవన్ క్లారిటీ..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగర తీరాన నిర్మించిన కొత్త సచివాలయం అందరినీ అబ్బురపరిచింది. ఈ సచివాలయం ప్రారంభోత్సవాన్ని కనులవిందుగా టీఆర్ఎస్ నిర్వహించింది. అయితే సచివాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఎలాంటి ఆహ్వానం పంపలేదని రాజ్‌భవన్ తాజాగా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

ఆహ్వానం అందినప్పటికీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ హాజరు కాలేదన్న ఆరోపణలను అధికార పార్టీ నేతలు రీసెంట్ గా చేశారు. గవర్నర్‌కి తెలంగాణ అభివృద్ధి కావడం ఇష్టం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే దానికి రిప్లైగా ఈ ప్రకటన వచ్చింది.

ఈ ఆరోపణలను రాజ్‌భవన్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చి, ఆమెకు ఆహ్వానం అందనందునే గవర్నర్‌ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని స్పష్టం చేసింది. రాజ్ భవన్ నుంచి వచ్చిన ఈ ప్రకటన ప్రారంభ కార్యక్రమానికి గవర్నర్ గైర్హాజరు కావడంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టింది.

రాష్ట్ర పరిపాలనలో గవర్నర్ కీలక పాత్ర పోషిస్తారనడంలో సందేహం లేదు. కాబట్టి ముఖ్యమైన ఈవెంట్‌లకు గవర్నర్ ని తప్పనిసరిగా ఆహ్వానించాలి. ఆహ్వానాన్ని స్వీకరించి గవర్నర్ కూడా హాజరు కావాలి. ఈ రెండింటిలో ఎవరి తప్పు ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.