Raghurama Krishnamraju : వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఏపీసీఐడీ వదిలిపెట్టేట్లులేదు. మూడు రోజుల పాటు రఘురాజును విచారించేందుకు సీఐడి రెడీ అయ్యింది. సోమ, మంగళ, బుధవారాల్లో విచారణ జరగాలి. హైదరాబాద్ లోని దిల్కుష్ అతిధి గృహంలో ఎంపీని విచారించేందుక సీఐడీ అన్నీ ఏర్పాట్లు జరిగింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి పోలీసుస్టేషన్లో గతంలో ఎంపీకి వ్యతిరేకంగా నమోదై ఒక కేసులోనే ఇపుడు సీఐడీ విచారించేందుకు రెడీ అయ్యింది.
ఎంపీపై 153(ఏ), 505 రెడ్ విత్, 120 (బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐడీ చెప్పింది. ఈ నోటీసును ఎంపీగా సీఐడీ పోయిన నెలలోనే పంపినా వెలుగులోకి చూసింది మాత్రమే ఇపుడే. అయితే ఈ నోటీసులపై రఘురామ స్పందన మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. తనను సీఐడీ విచారించాలని అనుకోవటం వాస్తవమే కానీ తనతో పాటు మరో ఇద్దరు నిందితులతో కలిపి విచారించాలని హైకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
తనను విచారించిన స్ధలంలోనే, విచారించిన సమయంలోనే మిగిలిన ఇద్దరు నిందితులను కూడా విచారించాలని హైకోర్టు సీఐడీని ఆదేశించినట్లు చెప్పారు. ఈ విషయాలను గుర్తుచేస్తు తాను సీఐడీ ఎస్పీకి లేఖ రాసినట్లు ఎంపీ చెప్పారు. ఈ విషయంలో పోలీసులు నియమ, నిబంధలను అతిక్రమిస్తే వెంటనే తాను హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. తాను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మిగిలిన ఇద్దరు నిందుతులను వేర్వేరు ప్రాంతాల్లో విచారించేందుకు సీఐడీ రెడీ అయ్యిందనే సమాచారం తనకు ఉందన్నారు. అయితే వారిద్దరిని ఎక్కడ ? ఏ సమయంలో విచారించబోతున్నారనే విషయం మాత్రం తెలీదన్నారు.
తమ విచారణలో పోలీసులు పారదర్శకంగా నడుచుకోవటం లేదన్న విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతోందని ఎంపీ చెప్పారు. ఇందుకనే సీఐడీ విచారణకు తాను హాజరుకావటంలేదని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే వారంలో విచారణ జరుగుతోంది కాబట్టి అప్పుడు ఏమి జరుగుతుందో చూడాలన్నారు. మొత్తానికి సీఐడీ-రాఘురామ మధ్య వ్యవహారం టామ్ అండ్ జెర్రీ షోలాగ తయారైంది.