Elections : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుద‌ల‌..పూర్తి వివ‌రాలు ఇవే!

Elections : ఓవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌జ‌ల‌పై విరుచుకుప‌డుతుంటే.. మ‌రోవైపు కేంద్ర ఎన్నికల సంఘం 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది. ఇందులో భాగంగానే తాజాగా ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను శ‌నివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర విడుద‌ల చేశారు. దీని ప్ర‌కారం.. ఈ సారి మొత్తం ఏడు ద‌శ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.

ఫిబ్రవరి 10న జ‌రిగే తొలి దశ పోలింగ్‌తో ఎన్నిక‌లు ప్రారంభం కానుండ‌గా.. ఫిబ్రవరి 14న రెండో దశ, ఫిబ్రవరి 20న మూడో దశ, ఫిబ్రవరి 23న నాలుగో దశ, ఫిబ్రవరి 27న ఐదో దశ, మార్చి 3న ఆరో దశ, మార్చి 7న ఏడో దశ పోలింగ్‌ను అధికారులు నిర్వ‌హించ‌బోతున్నారు. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో 403 అసెంబ్లీ స్థానాలు ఉండ‌టం వ‌ల్ల ఏడు ద‌శ‌ల్లోనూ అక్క‌డ పోలింగ్ జరుగుతుంది.

మొద‌టి ద‌శ‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో.. రెండో ద‌శ‌లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో.. మూడు నాలుగు ద‌శ‌ల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. ఐదో ద‌శ‌లో ఉత్తరప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో.. ఆరో ద‌శ‌లో ఉత్తరప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో.. ఏడో ద‌శ‌లో ఉత్తరప్రదేశ్ రాష్టంలో పోలింగ్ జ‌ర‌గనుంది. ఈ ఐదు రాష్టాల ఫ‌లితాలు మార్చి 10 వెలువ‌డ‌నున్నాయి.

అలాగే తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 14న జారీ అవుతుంది. అభ్యర్థులు జనవరి 21 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 27 చివరి తేదీ. రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 21న, మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 25న, నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 27న, ఐదో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 1న, ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 4న, ఏడో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 10న విడుద‌ల కానున్నాయి.