Sunday, May 22, 2022

Pawan Kalyan: పవనే సెంటర్ పాయింటా ?

Pawan Kalyan: రాష్ట్ర రాజకీయాల్లో విచిత్రమైన పరిస్దితి రాజ్యమేలుతోంది. ఒకవైపేమో 151 సీట్లతో అధికార వైసీపీ. మరోవైపేమో 23 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీ. మిత్రపక్షం హోదాలో కేంద్రంలో అధికారానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ. ఈ మూడుపార్టీలతో పోల్చుకుంటే పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన నథింగ్ అనే చెప్పాలి. కానీ విచిత్రంగా జనసేన పార్టీయే అన్నీ పార్టీలకు సెంటర్ పాయింట్ గా మారిపోయింది.

అన్నీ పార్టీల రాజకీయాలు, నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలన్నీ పవన్ కేంద్రంగానే జరుగుతున్నాయి. పవన్ ఏమి చేస్తారు ? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? ఎప్పుడు ఎక్కడ పర్యటిస్తారు ? అనే విషయాలపైనే అధికారపార్టీ నేతల చూపు నిలిచింది. మంత్రులు, ఎంఎల్ఏలు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ కన్వీనర్లలో అత్యధికులు పవన్నే టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తున్నారు.

ఎందుకింతగా జనసేన సెంటర్ పాయింటుగా మారిపోయింది. అధికార-ప్రధాన ప్రతిపక్షాల నేతలు ఒకరిపైన మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారంటే అర్ధముంది. మరి మధ్యలో సంబంధంలేకపోయినా పవన్ను ఎందుకు సీన్లోకి లాగుతున్నట్లు ? ఇక్కడే జనసేన ప్రాధాన్యత బయటపడుతోంది. ఈమధ్యకాలంలో జనసేన నేతలు, కార్యకర్తలు బాగా యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై అనేక రూపాల్లో ఆందోళనలు, నిరసనలతో జనాల్లోకి చొచ్చుకునిపోతున్నారు.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన కీలకపాత్ర పోషిస్తుందనే ప్రచారం పెరిగిపోతోంది. మిత్రపక్షమైన బీజేపీతో మాత్రమే కీలకపాత్ర పోషిస్తుందా ? లేకపోతే టీడీపీని కూడా పొత్తుల్లో కలుపుకుని ఎన్నికలకు వెళుతుందా ? అనే విషయమై చర్చ పెరిగిపోతోంది. వైసీపీ నేతల ఆరోపణల ప్రకారమైతే ఎన్నికలనాటికి పవన్ మిత్రపక్షమై బీజేపీని వదిలేసి చంద్రబాబునాయుడుతో జట్టుకడతారు. అంటే అప్పుడు వైసీపీ, టీడీపీ+జనసేన, బీజేపీ, కాంగ్రెస్+వామపక్షాలు కలిసి లేదా కాంగ్రెస్, వామపక్షాలు విడివిడిగా పోటీచేస్తాయి.

బీజేపీతో కలిసి జనసేన పోటీచేస్తే తమకు ఎలాంటి సమస్యా ఉండదని మంత్రులు, అధికారపార్టీ నేతలు భావిస్తున్నారు. అదే టీడీపీ+జనసేన కలిసి పోటీచేస్తే గట్టిపోటీ ఎదురవుతుందని అంచనా వేస్తున్నారు. ఎలాగంటే మొన్నటి ఎన్నికల్లో గుంటూరు నుండి శ్రీకాకుళం వరకున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 42 చోట్ల తమపార్టీ ఓడిపోయింది కేవలం జనసేన అభ్యర్ధుల వల్లే అని టీడీపీ నేతలు చెబుతున్నారు.

అంటే టీడీపీ మీద గెలిచిన వైసీపీ అభ్యర్ధులకు వచ్చిన మెజారిటీకన్నా జనసేనకు పోలైన ఓట్లు ఎక్కువ. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే వచ్చే ఎన్నికల్లో జనసేన కచ్చితంగా ఎక్కవ సీట్లు తెచ్చుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఎక్కువ సీట్లంటే ఎన్ననేదే సస్పెన్సుగా మారిపోయింది. అందుకనే తమతో మిత్రపక్షంగా ఉంచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో ఎలాగైనా జనసేనతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకనే వైసీపీ కూడా జనసేననే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. ఇలాంటి అనేక కారణాల వల్ల పవనే సెంటర్ పాయింటుగా మారిపోయారు.

Related Articles

- Advertisement -

తాజా వార్తలు