సర్వే వెనకాల కుట్రేమన్నా దాగుందా ?

వినటానికే కాదు చదవటానికి కూడా ఆశ్చర్యంగానే ఉంది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు లేదా సంస్ధలు సర్వేలు చేయటం పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీలు, సంస్ధలే కాదు కొంతమంది సిట్టింగ్ ఎంఎల్ఏలు కూడా తమసొంతంగా ఏదో ఒక సంస్ధతో కాంట్రాక్టు మాట్లాడుకుని సర్వేలు చేయించుకుంటున్నారు. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఆరా అనే సంస్ధ తెలంగాణా వ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించంది.

Advertisement

Advertisement

ఈ సర్వేలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కు రాబోయే ఓట్లశాతాన్ని ప్రకటించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓట్లశాతం బాగా తగ్గుతున్నట్లు బయటపడింది. ఇదే సమయంలో బీజేపీ మాత్రం ఓట్లషేరును గణనీయంగా పెంచుకుంటున్నట్లు సర్వేలో తేలింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే సర్వేలు చాలావరకు నూటికినూరుశాతం వాస్తవమే అని చెప్పేందుకు లేదు. సర్వేల్లో చెప్పినట్లే కాస్త అటుఇటుగా ఫలితాలు వచ్చిన సందర్భాలున్నాయి. ఇదే సమయంలో సర్వే ఫలితాలకు పూర్తివిరుద్ధంగా వచ్చిన సందర్భాలూ ఉన్నాయి.

పై మూడు పార్టీలకు రాబోయే ఓట్లశాతాన్ని పక్కనపెట్టేస్తే ఇతర పార్టీలకు 6.93 శాతం ఓట్లు వస్తాయని తేలిందట. ఇతర పార్టీల్లో షర్మిల ఆధ్వర్యంలోని వైఎస్సార్టీపీ అని సర్వే సంస్ధ ప్రత్యేకంగా ప్రకటించింది. మరి జనసేన పార్టీగురించి ఎందుకని ప్రస్తావించలేదో తెలీటంలేదు. ఖమ్మం, నల్గొండ జిల్లాలో వైఎస్సార్టీపీ బలమైన పార్టీగా ఎదుగుతుందని కూడా సర్వేలో తేలిందట. అంటే జనాలు షర్మిల పార్టీగురించి ఆలోచిస్తున్నట్లే అర్ధమవుతోంది. మరి ఇంతపెద్ద సర్వే నిర్వహించిన ఆరా సంస్ధ జనసేన విషయమై సర్వే చేసిందో లేదో చెప్పలేదు.

ఎందుకంటే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ గురించి చెప్పిన సర్వే సంస్ధ వైఎస్సార్టీపీ గురించి కూడా ప్రస్తావించింది. షర్మిల పార్టీ పెట్టడానికి ముందే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణాలో పర్యటించారు. అవకాశం ఉన్నపుడల్లా తెలంగాణాలో పర్యటిస్తునే ఉన్నారు. తెలంగాణాలో జనసేనకు 35 నియోజకవర్గాల్లో జనసేనకు ఒంటరిగానే గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి 35 నియోజకవర్గాల్లో అంత బలమున్న పార్టీని సర్వేసంస్ధ ఎందుకు విస్మరించింది ?

వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో జనసేన పోటీచేస్తుందని పవన్ గతంలోనే ప్రకటించారు. ప్రకటనతో సరిపెట్టుకోకుండా సభ్యత్వ నమోదు కూడా చేస్తున్నారు. మరింత యాక్టివ్ గా ఉన్న జనసేన పార్టీని సర్వే సంస్ధ పట్టించుకోలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. లేదంటే సర్వే వెనుక జనసేనను జనాల్లో పలుచన చేసే కుట్రేమన్నా దాగుందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా ఆరా సంస్ధ ప్రకటించిన ఫలితాల విషయంలో కాస్త అనుమానాలున్నాయి. ఒకవైపు టీఆర్ఎస్ కు ఓట్ల శాతం తగ్గుతుందని చెబుతునే కచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే టీఆర్ఎస్ కు ఓట్లశాతం బాగా తగ్గిపోతే అధికారంలోకి రావటం కష్టమే. సర్వేని చూసిన తర్వాత హంగ్ అసెంబ్లీ తప్పదేమో అనిపిస్తోంది.

Advertisement