pawan Kalyan : రాజకీయపార్టీలన్నాక ప్రచారం చాలా చాలా ముఖ్యం. ఒకపుడు సంప్రదాయపద్దతిలో ఎన్నికలు వచ్చినపుడు ప్రచారం చేస్తే సరిపోయేది. కానీ ఇపుడు అలా సరిపోదు. కచ్చితంగా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుండాల్సిందే. దాని ప్రకారం ప్రతిరోజు ప్రచారం చేసుకోవాల్సిందే. అధికారంలో ఉన్నపార్టీయా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలా అనేదానితో సంబంధంలేదు. ఇపుడు మీడియాను సోషల్ మీడియా బాగా డామినేట్ చేస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో కూడా అప్ డేట్ అవ్వాల్సిందే.
ఇదంతా ఇపుడెందుకంటే షెడ్యూల్ ఎన్నికలకు ఇక ఉన్నది రెండేళ్ళు మాత్రమే. చెప్పుకోవటానికి ఇంకా రెండేళ్ళుందని అనుకున్నా ఎన్నికల హీట్ మాత్రం విపరీతంగా పెరిగిపోతోంది. ఒక వైపు చంద్రబాబునాయుడు మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్యంతర ఎన్నికలు తధ్యమని పదే పదే చెబుతుండటంతో ఎన్నికల హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో అన్నీపార్టీలు సోషల్ మీడియాను బలోపేతం చేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా ప్రచారంలో ఒకపుడు తెలుగుదేశంపార్టీ బాగా బలంగా ఉండేది. 2019 ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత ఎందుకనో సోషల్ మీడియా వింగ్ బాగా బలహీనపడింది. ఇపుడిప్పుడు మళ్ళీ పుంజుకుంటోంది. ఇదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ కూడా బలంగానే ఉంది. రెండుపార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా ఏస్ధాయిలో యుద్ధం జరుగుతోందో అందరు ప్రత్యక్షంగా చూస్తున్నదే. మరి రెండు ప్రధాన పార్టీల మధ్య అంతలా యుద్ధం జరుగుతున్నపుడు జనేసేన ప్లేస్ ఏమిటి ?
నిజానికి సినిమా అభిమానిగా పవన్ కల్యాణ్ కున్న ఫ్యాన్ బేస్ ఇంకెవరికీ లేదు. సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఫేస్ బుక్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే అదంతా ఒకదారీ తెన్ను లేకుండా నడుస్తున్న ఫాలోయింగ్. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతున్నా రాజకీయపార్టీగా జనసేనకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. ప్రత్యేకించి పార్టీ తరపున పనిచేయటానికి సోషల్ మీడియా విభాగం బలంగా ఉండాలి. ఇపుడు జనసేనలో ఈ విభాగం పనిచేస్తోంది కానీ చాలా పరిమితసంఖ్యలోనే పనిచేస్తోంది.
సోషల్ మీడియా విభాగం జిల్లాలు, నియోజకవర్గాల స్ధాయిలోకి కూడా చొచ్చుకుని వెళ్ళాలి. తాజాగా ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో సోషల్ మీడియా విభాగం కోఆర్డినేటర్లను నియమించారు. అయితే ఇలాంటి నియామకాలు 175 నియోజకవర్గాల్లోను జరగాలి. వీటిని పర్యవేక్షించేందుకు, గైడెన్స్ ఇచ్చేందుకు, స్పీడు పెంచేందుకు మంగళగిరి కార్యాలయంలో బలమైన నిపుణులు కావాలి. ఈ నిపుణులు 24 గంటలూ, 365 రోజులూ పార్టీ పనిలోనే ఉండాలి.
ఇలాంటి బలమైన సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నపుడే పవన్ ఆలోచనలు, విధానాలను సోషల్ మీడియా జనాల్లోకి తీసుకెళ్ళగలవు. ఒకటి పవన్ కు మద్దతుగా సోషల్ మీడియా పనిచేస్తూనే ప్రతిపక్షాలపై దండయాత్రలు చేస్తుండాలి. వైసీపీ నేతలతో పాటు ప్రతిపక్షాల నేతలు ఏమి చేస్తున్నారు ? ఏమి మాట్లాడుతున్నారనే విషయాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతు కౌంటర్లు ఇస్తుండాలి. అప్పుడే పార్టీ జనాల్లోకి వెళ్ళగలుగు తుంది.