Janasena: పెద్ద సెక్షన్నే టార్గెట్ చేసుకున్నారా ?

Janasena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. రైతాంగాన్ని టార్గెట్ గా చేసుకుని పవన్ తన పర్యటనల్లో జోరుపెంచారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతులను ఆదుకోవటమనే టార్గెట్ పెట్టుకుని శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడిలో పర్యటించబోతున్నారు. చింతపూడిలోనే పవన్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం కూడా జరగబోతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో 40 మంది కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల దగ్గరకు పవన్ వెళ్ళి పరామర్శించి తలా లక్ష రూపాయల ఆర్ధికసాయాన్ని కూడా అందిచబోతున్నారు. ఇదే కార్యక్రమాన్ని ముందు అనంతపురం జిల్లాలో మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను కలిసి తలా లక్ష రూపాయల ఆర్ధికసాయాన్ని పార్టీ తరపున అందించారు. ఇపుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తర్వాత బహుశా కర్నూలు జిల్లాలో కూడా పర్యటించే అవకాశముందని జనసేన నేతలు చెబుతున్నారు. ఎందుకంటే ఈ జిల్లాలో కూడా కొందరు కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించబోతున్నట్లు స్వయంగా పవనే గతంలో ప్రకటించారు. అప్పట్లో చెప్పినపుడు అనంతపురం, కర్నూలు జిల్లాలన్నారు. అనంతపురం జిల్లా పర్యటించారు కాబట్టే తర్వాత పర్యటన కర్నూలులోనే ఉంటుందని అనుకున్నారు. కానీ మధ్యలో పశ్చిమగోదావరి జిల్లా వచ్చిచేరింది. అందుకనే తర్వాత జిల్లా కర్నూలని అనుకుంటున్నారు.

అంతా బాగానే ఉందికానీ రైతాంగాన్ని అందులోను కౌలురైతులనే పవన్ ఎందుకుని టార్గెట్ చేసుకున్నట్లు ? ఎందుకంటే సమాజంలో అత్యధిక శాతం రైతాంగం కాబట్టే. రాష్ట్ర జనాభాలో సుమారు 60 శాతం జనాభా వ్యవసాయ, వ్యవసాయాధారిత రంగాలపైనే ఆధారపడుంది. రైతుల్లో సామాజికవర్గాల సమీకరణలు చూసేది చాలా తక్కువ. రైతంటే రైతే కానీ ఆ రైతు ఏ కులపోడని మామూలుగా ఎవరు చూడరు. అదే ఇతర రంగాలు, ప్రధానంగా చదువుకున్న వాళ్ళల్లో అయితే ముందు సామాజికవర్గమే చూస్తున్నారు.

అందుకనే సామాజికవర్గాలతో పెద్దగా సంబంధం ఉండని రైతాంగాన్ని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. వీళ్ళ మద్దతుగనుక సంపాదించుకోగలిగితే పవన్ కష్టం సగం ఫలించినట్లే అనుకోవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత అందరిలాగే రైతాంగం కూడా ముందు చంద్రబాబునాయుడు పాలన చూసింది. ఇపుడు జగన్మోహన్ రెడ్డి పాలనను గమనిస్తోంది. కాబట్టి ఎక్కడైనా తేడాకొడితే రేపటి ఎన్నికల్లో పవన్ పరిపాలన ఎలాగుంటుందో చూడాలని అనుకునే అవకాశముంది.

అందుకనే లార్జ్ సెక్షన్ అయిన రైతాంగం మద్దతుపైన పవన్ దృష్టిపెట్టారు. ఇక రైతాంగమంటే ఎప్పుడూ సమస్యలతో సతమతమవుతునే ఉంటారు. నిజానికి రైతాంగానికి ఎంతసాయం చేసినా తక్కువే అవుతుంది. రైతాంగంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలే చాలా ఎక్కువుంటారు. కౌలురైతుల్లో అయితే నూటికి 90 శాతం ఉంటే ఎస్సీలు లేదా బీసీలే ఉంటారు. కాబట్టి అణగారిన వర్గాలు కూడా వాళ్ళే ఎక్కువ. అందుకనే పవన్ వ్యూహాత్మకంగా రైంతాగాన్ని ఎంచుకున్నారు. మరి పవన్ కష్టం ఫలిస్తుందా ?