pawan kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో పార్టీలో గానీ జనాల్లో కానీ మొదలైన సందేహమిదే. చంద్రబాబునాయుడుతో పాటు ఎల్లోమీడియా ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయంటు గోల మొదలుపెట్టేసింది. చంద్రబాబు చెప్పకపోయినా ఎల్లోమీడియా అయితే ప్రభుత్వం రద్దుకు, ఎన్నికల నిర్వహణకు ముహూర్తం కూడా పెట్టేసింది. నవంబర్లో ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దుచేసుకుంటారని, మార్చిలో ఎన్నికలు జరగబోతున్నాయంటు ముహూర్తం కూడా చెప్పేసింది.
సరే చంద్రబాబు, ఎల్లోమీడియా చెబుతున్నట్లు ముందస్తు ఎన్నికలు వస్తాయా రావా అన్నది జగన్ ఇష్టంపైనే ఆధారపడుంటుంది. బహుశా ఇదే విషయంలో పవన్ కు కూడా ఈపాటికే ఒక సమాచారం అందే ఉంటుందనటంలో సందేహంలేదు. చంద్రబాబు, ఎల్లోమీడియా చెబుతున్నట్లు ముందస్తు ఎన్నికలు వస్తాయనే అనుకుందాం. మరందుకు పవన్ సన్నద్ధంగా ఉన్నారా ? అన్నదే ఇపుడు కీలకపాయింట్. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ముందస్తు ఎన్నికలకు చంద్రబాబే సిద్ధంగాలేరు. అలాంటిది పవన్ ఎలా ఉండగలరు ?
ఇక్కడ సమస్య ఏమిటంటే జనసేన పార్టీ నిర్మాణం ఇప్పటికీ సరిగా జరగలేదు. ఇప్పటికప్పుడు పార్టీ నిర్మాణం గ్రామస్ధాయినుండి రాష్ట్రస్ధాయివరకు జరగాలంటే అయ్యేపనికాదు. కాబట్టి అత్యవసరంగా అభ్యర్ధుల ఎంపికపైనే పవన్ దృష్టిపెట్టాలి. పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేయాలి ? మిత్రపక్షం బీజేపీకి ఎన్నిసీట్లు వదిలిపెట్టాలనేది తేల్చుకోవాలి. బీజేపీ మాత్రమే మిత్రపక్షమైతే ఒక లెక్కగా ఉంటుంది. తెలుగుదేశంపార్టీ కూడా జతకలిస్తే లెక్క మారిపోతుంది.
కాబట్టి పొత్తుల విషయంలో పవన్ వెంటనే క్లారిటి తెచ్చుకోవాలి. ఆ క్లారిటిని పార్టీ నేతలకు కచ్చితంగా అందించాల్సుంటుంది. పొత్తులపై క్లారిటి వస్తే తర్వాత పోటీచేయబోయే సీట్ల సంఖ్య తేలుతుంది. సంఖ్య తేలిన తర్వాత పోటీచేయాల్సిన నియోజకవర్గాలేవి అనే విషయం బయటపడుతుంది. ఇవన్నీ ఒకరోజు, వారంలో జరిగేపనికాదు. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే కనీసం నెలరోజులవసరం ఉంటుంది. ఎందుకంటే తమతో చంద్రబాబును కూడా కలుపుకోవాలంటే ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను ఒప్పించాల్సిన బాధ్యత కూడా పవన్ మీదేపడుతుంది.
బీజేపీ అగ్రనేతలను కలవాలంటే మూడు, నాలుగుసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగాలి. ఒకవేళ అగ్రనేతల తరపున ఎవరైనా రాష్ట్రానికి వచ్చినా వారితో కూడా చాలా భేటీలు జరుపాలి. చంద్రబాబుతో పొత్తులంటే మామూలు విషయంకాదు. ముందొకమాట చెప్పి వెనకొకటి చేసేరకం చంద్రబాబు. ముందు పొత్తులంటారు, తర్వాత కొన్ని సీట్లలో పంచాయితీ తెగటంలేదని చెప్పి ఫ్రెండ్లీ కంటెస్టంటారు. ఆ తర్వాత పొత్తుల్లో వదులుకున్న సీట్లలో కూడా టీడీపీ నేతలు నామినేషన్లు వేసేస్తారు.
ఇలాంటి వివాదాలన్నీ చంద్రబాబుతో పొత్తులు పెట్టుకున్న పార్టీలకు బాగా అనుభవమే. ముఖ్యంగా గట్టిదెబ్బతిన్న బీజేపీ నేతలకు ఇంకా బాగా అనుభవం. అందుకనే చంద్రబాబుతో పొత్తంటేనే దూరంగా పరిగెడుతున్నది. మరి ఇవన్నీ సర్దుబాటు జరగాలంటే మామూలు విషయంకాదు. క్లారిటితో మాట్లాడుకుని పొత్తులు, సీట్లు, నియోజకవర్గాలను ఫైనల్ చేయటానికి పవన్ సిద్ధంగా ఉన్నారా అన్నదే అసలు పాయింట్.