MP Bharath : ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ చాకచక్యంగా ఆత్మహత్యకు పాల్పడుతున్న ఓ యువకుడి ప్రాణాలను కాపాడారు. రాజమండ్రి రోడ్డు కం రైలు వంతెన పై ఆ యువకుడు నా తనువు చాలించాలని అనుకున్నాడు.. ఆ యువకుడుని అటుగా వెళుతున్న మార్గాని భరత్ కాపాడిన ఘటన స్థానికంగా చర్చనీయాంసమైంది..
గోదావరిలో దూకపోయిన యువకుడిని కాపాడారు భరత్. ఆ యువకుడి ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దాంతో తన స్వగ్రామం ఉనకరమిల్లి నుండి తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు దూరంగా బైక్ పై వచ్చి.. రాజమండ్రి కొవ్వూరు రోడ్డు కం రైలు వంతెన పైకి చేరాడు. బైక్ ఒక పక్కన పెట్టి ఒక్కసారిగా బ్రిడ్జి పై నుండి గోదావరిలో దూకేందుకు సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో గోపాలపురంలోని ఒక శుభ కార్యక్రమానికి బయలుదేరిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఈ కుర్రాడిని చూశాడు. అంతే వాహనాన్ని తను వెళుతున్న కారును అక్కడే ఆపేసి కారులో నుంచి ఒక్క ఉదుటున దూకి..వెంటనే ఆ కుర్రాడి కాలర్ పట్టుకుని వెనక్కి లాగారు. ఆ తరువాత అతనిని ఫుట్ పాత్ పై నుండి రోడ్డు మీదకు బలంగా తీసుకువచ్చారు.
ఎంపీ అనుచరులు ఆ యువకుడిని పట్టుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపటి వరకు ఆ షాక్ నుండి చేరుకోలేకపోయాడు. నీకు ఏం కష్టం వచ్చిందని ఎంపీ మార్గాని భరత్ ఆ కుర్రాడిని అడగగా.. అతను పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఈ కుర్రాడికి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించమని రాజమండ్రి టూ టౌన్ సి ఐ టి గణేష్ కు ఫోన్ చేసి చెప్పారు.
ఆటోలో కొంతమంది సహాయంతో నగరంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కు ఆ యువకుడిని తీసుకువెళ్లారు. పోలీసులు ఆ యువకుడి పేరు అయ్యప్ప అని, తన తండ్రి పేరు సీతాపతి రావు అని చెప్పారు. ఆ యువకుడు వారి తల్లిదండ్రులకు ఆరవ సంతానమని.. తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసి.. జడ్చర్ల అరబిందో ఫార్మసీలో మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసినట్లు కూడా పోలీసు అడిగిన ప్రశ్నలకు ఆ యువకుడు సమాధానం చెప్పాడు. ఈ యువకుడి ప్రాణాలు కాపాడినందుకు ఎంపీ భరత్ ను పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ప్రశంసిస్తున్నారు.