Politician Audio : వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోపాల్ రెడ్డి..కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రతాపరెడ్డి తీరుపై మండిపడిన ఆడియో వైరల్ గా మారింది. వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను గుర్తించటం లేదని ఆడియోలో గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. పార్టీ కోసం అనేక కష్టాలు పడి ఉన్న వారిని పక్కకు పెట్టి ఏనాడు జెండా మోయని వారికి పార్టీ పదవులను కట్టబెట్టడం దారుణమని కార్యకర్తలను మోసగించడమే అని మండిపడ్డారు.
ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రతాపరెడ్డి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి.. ప్రాధాన్యత ఇస్తున్నారని గోపాల్ రెడ్డి ఆడియోలో ఆరోపించారు. ఈ పరిణామంతో పాత వైసిపి కార్యకర్తలు ఎవరు కూడా పార్టీ కార్యాలయం వైపు చూడని పరిస్థితి ప్రస్తుతం దాపరించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా అయితే వచ్చే ఎన్నికలలో గెలిచే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. ఇటువంటి క్రమంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలలో అసంతృప్తి తొలగించే ప్రయత్నాలు అధిష్టానం చూడాలని సూచించారు. నియోజకవర్గంలో ప్రాధాన్యత లేకుండా ఇతర పార్టీల నుంచి వచ్చి పార్టీకి కనీసం పట్టుమని పది ఓట్లు కూడా వేయించిన వారికి ప్రాధాన్యత కల్పిస్తే పార్టీ భవిష్యత్తు ప్రమాదకరంలోకి వెళ్లే పరిస్థితులు ఉన్నాయని హెచ్చరించారు.
పార్టీ కోసం కనీస ఖర్చు కూడా పెట్టని వారికి నేడు… ఆదోని నియోజకవర్గంలో అత్యున్నత పదవులు కట్టబెట్టడం.. నిజమైన కార్యకర్తలకి అన్యాయం చేసినట్లే. ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో మధ్యలో వచ్చిన వారికి కేటాయిస్తున్నారు. దీంతో ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన కార్యకర్త కనీసం గౌరవం కూడా పొందుకోలేని పరిస్థితులు దాపరించాయి అంటూ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.