janasena: జనసేనకు ‘జనవాణి’ భరోసా ఇస్తుందా ?

janasena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వినూత్ర కార్యక్రమంతో జనాల్లోకి వెళుతున్నారు. వచ్చే నెల 3వ తేదీన విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జనవాణి అనే కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించబోతున్నారు. జనవాణి ప్రోగ్రామ్ ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవటమే. ఆ సమస్యలపై జనాల నుండి వినతిపత్రాలను తీసుకుంటారు. అలా తీసుకున్నవాటికి పార్టీ రశీదు కూడా ఇస్తుంది. అలా తీసుకున్న వినతులను శాఖల వారీగా విడదీసి ఏ అధికారికి పంపాల్సిన వినతులను ఆశాఖల అధికారులకు పంపుతారు.

శాఖల వారీగా తాము పంపిన వినతులకు అధికారుల దగ్గర నుండి ఎక్ నాలెడ్జిమెంట్ కూడా పార్టీ నేతలు తీసుకోబోతున్నారు. సమస్యల పరిష్కారానికి టైం బౌండ్ పెట్టుకుని వాటి పరిష్కారానికి ఫాలోఅప్ చేస్తారు. అంటే మామూలుగా జనాలే తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఆఫీసులకు, అధికారుల చుట్టు తిరుగటమే అందరికీ తెలిసింది. అయితే ఇలా తిరిగేవాళ్ళ సమస్యలు ఎన్ని పరిష్కారమవుతాయో ఎవరు చెప్పలేరు.

ఇపుడు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమానికి స్పందన అని పేరుపెట్టి కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. అయితే ఆ కార్యక్రమంలో కలెక్టర్లు ఎన్ని వినతులను అందుకుంటున్నారు, ఎన్ని పరిష్కారాలవుతున్నాయనే విషయంపై ఎవరికీ క్లారిటిలేదు. సమస్యల పరిష్కారంపై జనాలు అధికారులను కలవాలని అనుకున్నప్పుడల్లా కలవలేరు. ఒకవేళ ఏదైనా శాఖలకు జనాలు వెళ్ళినా వినిపించే సమాధానం అంతంతమాత్రమే. అయ్యే సమస్యల పరిష్కారం అవుతాయి లేనివి లేవంతే.

ఈ నేపధ్యంలోనే ప్రభుత్వానికి జనాలకు మధ్యలో జనసేన నిలవబోతోంది. జనవాణి కార్యక్రమాన్ని ఐదువారాల పాటు డైరెక్టుగా పవనే నిర్వహించబోతున్నారు. మొదటి రెండు కార్యక్రమాలను విజయవాడలోనే నిర్వహించబోతున్నారు. ఐదు ఆదివారాల్లో ఐదు కార్యక్రమాలన్నమాట. మిగిలిన మూడు కార్యక్రమాలు రాయలసీమ, ఉభయగోదావరి, ఉత్తరాంధ్రలో నిర్వహించబోతున్నారు. వీటితేదీలు ఖరారుకాకపోయినా తొందరలోనే ప్రకటిస్తామని రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

నిజానికి పవన్ టేకప్ చేయబోతున్న జనవాణి కార్యక్రమం మంచిదనే చెప్పాలి. ఈ కార్యక్రమం ద్వారా తామిచ్చే సమస్యల తాలూకు వినతపత్రాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎంత సమయం తీసుకుంటున్నది ? అసలు పరిష్కరిస్తున్నదా ? లేదా ? లాంటి అనేక ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ప్రభుత్వవైఖరి ఆధారంగా కార్యక్రమాలను ప్లాన్ చేసుకునేందుకు పార్టీకి అవకాశం దొరుకుతుంది.

సమస్యలను వెంటనే పరిష్కరించటం ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యంకాదు. వ్యక్తిగత సమస్యలుంటే వాటిని వెంటనే పరిష్కరించే అవకాశముంది కానీ కమ్యూనిటి సమస్యలను పరిష్కరించటం అంత ఈజీకాదు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం విషయంలో జనసేన ప్రభుత్వంపై బాగా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశముంది. ఇదే కారణంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను మొదలుపెట్టచ్చు కూడా. ఏదేమైనా జనాల్లోకి చొచ్చుకుని పోయేందుకు జనసేన మొదలుపెట్టబోతున్న కార్యక్రమం వల్ల కొందరికి లాభం జరిగినా మంచిదే కదా.