Janasena: జనసేనకు ఎక్కువ సమయంలేదా ?

Janasena: తెలంగాణాలో మొదలైన ముందస్తు ఎన్నికలహీట్ ప్రభావం ఏపీ మీద కూడా పడే అవకాశముంది. ఇప్పటికే చంద్రబాబునాయుడు ముందస్తు ఎన్నికలు తప్పవంటు అక్కడకక్కడ గోల చేస్తున్నారు. ఇప్పటికైతే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదని వైసీపీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే పక్కరాష్ట్రంలో గనుక ముందస్తు ఎన్నికలు ఖాయమైతే దాని ప్రభావం ఏపీమీద కూడా పడే అవకాశముంది. అప్పుడు ఏపీలో కూడా ముందస్తు హీట్ పెరిగిపోతుంది.

అధికారంలో ఉందికాబట్టి వైసీపీకి ముందస్తు అయినా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలైనా పెద్దగా తేడా ఉండదు. ఇదే సమయంలో చంద్రబాబు మాత్రం ముందస్తుకు చాలా తొందరపడుతున్నారు. వాస్తవానికి టీడీపీ కూడా ముందస్తుకు రెడీగా లేదు. ఎందుకంటే కనీసం 80 నియోజకవర్గాల్లో పార్టీకి గట్టి అభ్యర్ధులు లేరన్నది వాస్తవం. ఈ సంఖ్య ఎవరో గాలికిపుట్టించింది కాదు. స్వయంగా నారా లోకేష్ చెప్పిన సంఖ్యే. 40 నియోజకవర్గాల్లో ఇన్చార్జిలు లేరని మరో 40 నియోజకవర్గాల్లో నేతల మధ్య తీవ్రస్ధాయిలో విబేధాలున్నాయని లోకేష్ మహానాడు సందర్భంగా చెప్పిందే.

సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలో నుండి దింపేసి అర్జంటుగా సీఎం అయిపోవాలనే కోరికతో ఉన్నారు కాబట్టి చంద్రబాబు ముందస్తుకు సై అంటున్నారు. మరీ పరిస్ధితుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్టాండ్ ఏమిటి ? ముందస్తు ఎన్నికలు వచ్చేస్తే ఏమిచేస్తారనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే తెలంగాణాలో కూడా జనసేన పోటీచేస్తుందని ఈమధ్య పవనే ప్రకటించారు. కనీసం 35 నియోజకవర్గాల్లో గెలిచేసత్తా జనసేనకు ఉందని చెప్పారు. కాబట్టి ఎన్నికలకు రెడీ అయిపోవాల్సిందే. తెలంగాణాలో పార్టీకి సరైన నిర్మాణమేలేదు. కాబట్టి వెంటనే పార్టీ నిర్మాణంపైన దృష్టి పెట్టడమే కాకుండా అభ్యర్ధులను కూడా రెడీచేసుకోవాలి.

సినిమా షూటింగులను పూర్తిగా పక్కనపెట్టేసి 24 గంటలూ తన దృష్టిని పూర్తిగా రాజకీయాల మీదే పెట్టాలి. అభ్యర్ధుల ఎంపిక విషయాన్ని పవన్ మొదలుపెట్టకపోతే రేపు ఎన్నికల్లో పోటీచేయటానికి గట్టి అభ్యర్ధులు కూడా దొరకరు. అలాగే ప్రచారం విషయంలో స్పష్టమైన రూటుమ్యాపును రెడీచేసుకోవాలి. ఏ పార్టీతో అయినా పొత్తులుంటే దాన్ని ఫైనల్ చేసుకోవాలి. అప్పుడు జనసేన అభ్యర్ధుల లిస్టు రెడీ అవుతుంది. ఎలాగూ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఏదో పద్దతిలో అభ్యర్ధులను నిలబెడతాయనటంలో సందేహంలేదు.

ఇదే సమయంలో ఏపీ విషయంపైన కూడా పవన్ కసరత్తు మొదలుపెట్టేయాల్సిందే. ఎందుకంటే తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు పూర్తయ్యేసరికి ఏపీలో అదే హీట్ బాగా పెరిగిపోవటం ఖాయం. అంటే రిలే రన్నింగ్ రేసు పద్దతిలో పవన్ రెండురాష్ట్రాల్లోను ఎన్నికల రేసులో పరిగెత్తాల్సిందే. ముందు తెలంగాణాలో పరుగు మొదలుపెట్టిన పవన్ ఏపీ ఎన్నికలతో పరుగును ముగించాల్సుంటుంది. కాబట్టి రెండురాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కచ్చితమైన షెడ్యూల్ ప్లాన్ చేసుకోకపోతే ఇబ్బందులు పడాల్సుంటుంది. మరి విజయదశమి నుండి ఏపీలో బస్సుయాత్రకు చేసుకుంటున్న ప్లాన్ ఏమవుతుందో చూడాల్సిందే.