Pawan Kalyan: గ్రాస్ రూట్ పై జనసేన దృష్టిపెట్టిందా ?

Pawan Kalyan: షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో జనసేన గ్రాస్ రూట్ పై ఇపుడు దృష్టిపెట్టినట్లుంది. పార్టీ సీనియర్ నేతలు మాట్లాడుతు గ్రామాల్లో యువజన సంఘాల ఏర్పాటుపై అందరు దృష్టిపెట్టాలని కోరుతున్నారు. ప్రతి గ్రామంలోను, పట్టణాల్లోని ప్రతి వార్డుల్లోను యువజనులంతా ఏకం కావాలన్నారు. యువజనులంతా ఏకమై సంఘాలు పెట్టుకోవాలట. మౌళిక సమస్యలను, సదుపాయల లేమిని గుర్తించాలట.

అలాగే తమ అవసరాలేమిటి ? సమస్యల పరిష్కారాలేమిటి ? దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలేమిటి అనే విషయాలపై బాగా స్టడీ చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ చెప్పారు. గ్రామాల్లోను, వార్డల పరిధిలోను జరుగుతున్న సహజవనరుల దోపిడీని గమనించాలని, వాటిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయాలని, వాటినే పార్టీ దృష్టికి కూడా తీసుకురావాలన్నారు. దీనివల్ల జనాల్లో సహజవనరుల దోపిడీకి వ్యతిరేకంగా, సమస్యలకు వ్యతిరేకంగా జనాలను జాగృతం చేయచ్చని చెప్పారు.

జనసేన ఇలాంటి సమస్యలను టేకప్ చేయటం ద్వారా, యువజన సంఘాలను ఏర్పాటుచేయటం ద్వారా జనాలతో తొందరగా కనెక్టయ్యే అవకాశాలున్నాయి. నిజానికి ఇపుడు చెప్పిన పద్దతి చాలామంచిదనటంలో సందేహంలేదు. కానీ ఈ పద్దతిని ఎప్పుడో మొదలుపెట్టుండాల్సిందే. గతంలోనే యువజనసంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టుంటే పార్టీకి గ్రాస్ రూట్లో ఈపాటికే పట్టు దొరికుండేది. గ్రామస్ధాయిలో పట్టులేకుండా ఏ పార్టీకూడా సాదించేదేమీ ఉండదు.
షెడ్యూల్ ఎన్నికలకు ఉన్నది ఇక రెండేళ్ళు మాత్రమే. ఇందులో కూడా చివరి ఏడాది నూరుశాతం ఎన్నికల సంవత్సరమే అన్న విషయం తెలిసిందే. ఇకపుడు ఇలాంటి ప్రయోగాలకు, పటిష్టంచేసే పనులకు ఏ పార్టీకి కూడా సమయం దొరకదు. మొత్తం అభ్యర్ధుల ఎంపిక, అభ్యర్ధులను బలోపేతం చేయటం, నియోజకవర్గాల్లో ఎవరిని పోటీలోకి దింపాలి, టికెట్ కోసం రేసులో ఉన్న నేతల జాబితాలు ఫైనల్ చేయటం లాంటి అనేక పనులతో ప్రతీపార్టీ చాలా బిజీగా ఉంటుంది.

కాబట్టి జనసేన ఇప్పటినుండి జెట్ స్పీడుతో పనిచేసుకోకపోతే ఇబ్బందులు పడటం ఖాయం. ఎందుకంటే అధికారంలో ఉన్న వైసీపీకి ఎలాంటి ఇబ్బందీలేదు. అధికారంలో ఉందికాబట్టి చాలా సమస్యలను అధిగమించగలుగుతుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కొన్ని ఇబ్బందులున్నా అధిగమనించేస్తుంది. ఎందుకంటే ఆ పార్టీకి గ్రామస్ధాయినుండి పటిష్టమైన యంత్రాంగముంది. ప్రతి నియోజకవర్గంలోను గట్టి నేతలున్నారు. కాబట్టి ఈ పార్టీకి కూడా పెద్దగా సమస్యలు లేవు.

ఎటొచ్చి తొందరపడకపోతే ఇబ్బందులు పడాల్సిందే జనసేన మాత్రమే. కాబట్టి గ్రామస్ధాయిలో యువజనసంఘాలు, వార్డుల స్ధాయిలో వార్డు సంఘాలను వెంటనే ఏర్పాటుచేసుకోవాలి. ఇదే సమయంలో మండల, జిల్లాతో పాటు రాష్ట్రస్ధాయి కమిటీలను కూడా పూర్తిస్ధాయిలో నియమించుకోవాలి. ఇవన్నీ కనీసం రెండు, మూడు నెలల్లో పూర్తిచేస్తే కానీ మిగిలిన విషయాలపై దృష్టి పెట్టడానికి జనసేన అధినేతకు అవకాశముండదు. ఇప్పటికైనా మేల్కొన్నందుకు పార్టీ నేతలను అభినందించాల్సిందే.